ఇందిరమ్మ టవర్స్ ఎలా ఉండబోతున్నాయి. . ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు.. ఎలా?

హైదరాబాద్ క్యూర్ (CURE) పరిధిలో నిర్మించనున్న ఇందిరమ్మ టవర్స్ పథకంపై ప్రజల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కాల్ సెంటర్ హెల్ప్‌లైన్‌ను ప్రారంభించింది. దరఖాస్తు విధానం, అర్హతలు, ఈఎండీ చెల్లింపు, ఫ్లాట్ల కేటాయింపు తదితర అంశాలపై నేరుగా అధికారుల నుంచి సమాచారం పొందాలని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు.

25 జులై, 2026 10:48 PM•ByLaharika

Share this article

ఇందిరమ్మ టవర్స్ ఎలా ఉండబోతున్నాయి. . ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు.. ఎలా?

హైదరాబాద్ : హైదరాబాద్ మహానగరంలోని పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు నగర పరిధిలోనే గౌరవప్రదమైన సొంతింటిని అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ టవర్స్ పథకానికి సంబంధించిన సందేహాల నివృత్తి కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార & పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం ప్రారంభించారు.

హౌసింగ్ బోర్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి మాట్లాడుతూ, ప్రజలు ఎలాంటి అపోహలు, తప్పుడు ప్రచారాలను నమ్మకుండా అధికారిక సమాచారం కోసం 040-24603572 నంబర్‌కు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సంప్రదించాలని సూచించారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో సమాచారం అందుబాటులో ఉంటుందని తెలిపారు.

తొలి విడతలో 7,680 ఇళ్లు

క్యూర్ పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోందని, తొలి విడతలో 16 నియోజకవర్గాల్లో 7,680 ఫ్లాట్ల నిర్మాణం చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. దరఖాస్తుదారులు తమకు చెందిన నియోజకవర్గంలోనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

దరఖాస్తులు మీ సేవ కేంద్రాలు, ఆన్‌లైన్ పోర్టల్, వాట్సాప్ ద్వారా చేసుకోవచ్చని, మధ్యవర్తులను ఆశ్రయించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

ఎవరు అర్హులు?

హైదరాబాద్ క్యూర్ పరిధిలో కనీసం 10 సంవత్సరాలుగా నివసిస్తున్న అల్పాదాయ వర్గాల కుటుంబాలు ఈ పథకానికి అర్హులని మంత్రి తెలిపారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షల లోపు ఉండాలని, కుటుంబ సభ్యుల పేరిట క్యూర్ లేదా ఓఆర్ఆర్ పరిధిలో ఇల్లు, ఫ్లాట్ లేదా స్థలం ఉండకూడదని పేర్కొన్నారు. ఒక కుటుంబం నుంచి ఒక దరఖాస్తు మాత్రమే స్వీకరిస్తామని, అర్హత సాధించిన కుటుంబానికి ఒక ఫ్లాట్ మాత్రమే కేటాయిస్తామని చెప్పారు.

ఆధార్ ఒక్కటే చాలు

దరఖాస్తు సమయంలో ఆధార్ నంబర్ మాత్రమే నమోదు చేస్తే సరిపోతుందని మంత్రి తెలిపారు. కుల ధ్రువీకరణ, ఆదాయ ధ్రువీకరణ వంటి పత్రాలను అప్పుడే అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదని, లాటరీ ప్రక్రియ అనంతరం అవసరమైనప్పుడు సమర్పించవచ్చని వివరించారు.

రూ.10 వేల ఈఎండీ.. రాకపోతే రీఫండ్

దరఖాస్తు సమయంలో రూ.10,000 ఈఎండీని యూపీఐ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారానే చెల్లించాలని మంత్రి సూచించారు. నగదు లేదా ఇతర చెల్లింపు విధానాలు ఉండవని స్పష్టం చేశారు. ఒకవేళ ఫ్లాట్ కేటాయింపు జరగకపోతే, చెల్లించిన మొత్తం అదే బ్యాంకు ఖాతాకు తిరిగి జమ అవుతుందని తెలిపారు.

అలాగే దరఖాస్తు రశీదు, చెల్లింపు రశీదు, అప్లికేషన్ నంబర్, మొబైల్ నంబర్‌ను ప్రక్రియ పూర్తయ్యే వరకు భద్రంగా ఉంచుకోవాలని సూచించారు.

ఫ్లాట్ వివరాలు

ఈ పథకం కింద నిర్మించే ఫ్లాట్లు ఒక బెడ్‌రూమ్, హాల్, కిచెన్ (1BHK) నమూనాలో సుమారు 525 చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మించబడతాయని తెలిపారు. ఒక్కో ఫ్లాట్ మార్కెట్ విలువ రూ.40 నుంచి రూ.60 లక్షల వరకు ఉంటుందని, ఇందులో ప్రభుత్వం రూ.5 లక్షల సబ్సిడీతో పాటు 20 నుంచి 25 గజాల అన్‌డివైడెడ్ షేర్ స్థలాన్ని లబ్ధిదారుడి పేరుతో నమోదు చేస్తుందని వెల్లడించారు. లబ్ధిదారుడు కేవలం రూ.6 లక్షలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని మంత్రి వివరించారు.

అర్హులైన దరఖాస్తుదారుల సంఖ్య అందుబాటులో ఉన్న ఫ్లాట్ల కంటే ఎక్కువగా ఉంటే, పూర్తిగా పారదర్శక లాటరీ విధానం ద్వారా కేటాయింపులు చేపడతామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో హౌసింగ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వి.పీ. గౌతమ్, హౌసింగ్ బోర్డు సీఈ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు