హైదరాబాద్, ఆగస్టు 6(జనవాణి): పట్టుదలతో నైపుణ్యాలను మెరుగుపరుచుకుని, విదేశీ భాషపై పట్టు సాధిస్తే అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని తెలంగాణ యువ ఫిజియోథెరపిస్టు పి.ఐశ్వర్యరాణి నిరూపించారు. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ (టామ్‌కామ్) సహకారంతో జర్మనీలో ఫిజియోథెరపిస్టుగా ఉద్యోగం సాధించారు. నెలకు రూ.3.5 లక్షల ప్రారంభ వేతనంతో ఆమె అక్కడ విధుల్లో చేరనున్నారు.
విదేశాల్లో ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలనే లక్ష్యంతో ఐశ్వర్యరాణి టామ్‌కామ్‌ను సంప్రదించారు. జర్మనీలో వైద్య, ఆరోగ్య రంగాల్లో ఉన్న ఉపాధి అవకాశాలకు అనుగుణంగా టామ్‌కామ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జర్మన్ భాష శిక్షణలో చేరారు. క్రమంగా వివిధ స్థాయిలను పూర్తి చేస్తూ బీ2 స్థాయి వరకు జర్మన్ భాషలో శిక్షణ పొందారు. భాషా నైపుణ్యంతో పాటు ఉద్యోగానికి అవసరమైన ప్రక్రియలను విజయవంతంగా పూర్తి చేసి జర్మనీలో ఉద్యోగ అవకాశాన్ని దక్కించుకున్నారు.
ఈ సందర్భంగా శక్తి ( కార్మిక, ఉపాధి, శిక్షణ మరియు ఫ్యాక్టరీలు) మరియు గనుల శాఖ మంత్రి డా.జి.వివేక్ వెంకటస్వామి ఐశ్వర్యరాణికి నియామక పత్రాన్ని అందజేసి అభినందించారు. విదేశాల్లో ఉన్నత ఉద్యోగాన్ని సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
తెలంగాణ యువతకు దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ మెరుగైన ఉపాధి అవకాశాలు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. విదేశాల్లో వివిధ రంగాల్లో నైపుణ్యం కలిగిన మానవ వనరులకు మంచి డిమాండ్ ఉందని, అందుకు అనుగుణంగా రాష్ట్ర యువతను సిద్ధం చేయాల్సిన అవసరం ఉందన్నారు. టామ్‌కామ్ ద్వారా నైపుణ్య శిక్షణతో పాటు విదేశీ భాషల్లో శిక్షణ అందిస్తూ యువతకు అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలకు మార్గం సుగమం చేస్తున్నామని చెప్పారు.
విద్యార్హతలతో పాటు వృత్తిపరమైన నైపుణ్యాలు, విదేశీ భాషలపై పట్టు సాధిస్తే ప్రపంచవ్యాప్తంగా మంచి వేతనాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని మంత్రి పేర్కొన్నారు. జర్మనీతో పాటు ఇతర దేశాల్లోనూ వివిధ రంగాల్లో తెలంగాణ యువతకు అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఐశ్వర్యరాణి సాధించిన విజయం విదేశాల్లో కెరీర్‌ను నిర్మించుకోవాలనుకునే రాష్ట్ర యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పారు.
ఐశ్వర్యరాణి జర్మనీలో నెలకు రూ.3.5 లక్షల ప్రారంభ వేతనంతో ఉద్యోగంలో చేరనున్నట్లు అధికారులు తెలిపారు. అక్కడ విధుల్లో చేరిన అనంతరం అవసరమైన వృత్తిపరమైన శిక్షణలను పూర్తి చేయాల్సి ఉంటుందని, వాటిని విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత ఆమె వేతనం మరింత పెరిగే అవకాశం ఉందని వివరించారు.
ఉపాధి, శిక్షణ శాఖ డైరెక్టర్ కాంతి వెస్లీ, ఐఏఎస్ ఐశ్వర్యరాణిని అభినందించారు. అంతర్జాతీయ ఉద్యోగ విపణిలో వస్తున్న అవకాశాలను తెలంగాణ యువత అందిపుచ్చుకోవాలని సూచించారు. టామ్‌కామ్ ద్వారా అందిస్తున్న నైపుణ్యాభివృద్ధి, విదేశీ భాషల శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సరైన శిక్షణ, ప్రణాళికతో ముందుకు సాగితే విదేశాల్లో మెరుగైన ఉద్యోగాలను సాధించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టామ్‌కామ్ అధికారులు, ఐశ్వర్యరాణి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.





















