తెలంగాణలో మరోసారి వర్షాలు ఉద్ధృతం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం తెలంగాణ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని అధికారులు తెలిపారు.
ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. ఆయా జిల్లాల ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని, వర్షాల సమయంలో చెట్ల కింద నిలబడకూడదని, నీరు నిలిచిన ప్రాంతాల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
హైదరాబాద్ నగరంలో ఈ రోజు రాత్రి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. అనంతరం ఒకటి రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు, మెరుపుల సమయంలో సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.




















