ఆయిల్ కంపెనీ జాబ్ అని చెప్పి రష్యాకు.. చివరికి ఆర్మీలోకి! నలుగురు తెలంగాణ యువకుల కోసం కుటుంబాల కన్నీటి వేడుకోలు

ఉపాధి కోసం రష్యా వెళ్లిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన నలుగురు తెలంగాణ యువకులు అనూహ్యంగా రష్యా సైన్యంలో చేరి యుద్ధభూమిలో చిక్కుకున్నారని వారి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆయిల్ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఏజెంట్లు నమ్మించి విదేశాలకు తీసుకెళ్లి, ఆ తర్వాత ఆర్మీలో చేర్చారని కుటుంబాలు పేర్కొన్నాయి. యువకులను సురక్షితంగా స్వదేశానికి రప్పించాలని హైదరాబాద్‌లోని సీఎం ప్రవాసీ ప్రజావాణిలో ప్రభుత్వాన్ని వేడుకున్నారు.

29 సెప్టెంబర్, 2026 8:18 PM•ByNarender Kumar Nangunoori

Share this article

ఆయిల్ కంపెనీ జాబ్ అని చెప్పి రష్యాకు.. చివరికి ఆర్మీలోకి! నలుగురు తెలంగాణ యువకుల కోసం కుటుంబాల కన్నీటి వేడుకోలు

హైదరాబాద్, సెప్టెంబర్ 29 (జనవాణి): ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన నలుగురు తెలంగాణ యువకులు ప్రస్తుతం తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకున్నారని వారి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయిల్ కంపెనీలో భారీ వేతనంతో ఉద్యోగం ఇప్పిస్తామని ఏజెంట్లు నమ్మించి రష్యాకు తీసుకెళ్లారని, అక్కడ పరిస్థితులు మారడంతో వారిని రష్యా సైన్యంలో చేర్చారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ప్రస్తుతం యుద్ధభూమిలో ఉన్న తమ వారిని ఎలాగైనా సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని కోరుతూ హైదరాబాద్‌లోని సీఎం ప్రవాసీ ప్రజావాణిలో కన్నీటి పర్యంతమయ్యారు.

ఆయిల్ కంపెనీ ఉద్యోగం పేరుతో రష్యాకు..

మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో సీఎం ప్రజావాణి రాష్ట్ర స్థాయి ఇన్‌చార్జ్, తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా మండలి వైస్ చైర్‌పర్సన్ గద్వాల్ విజయలక్ష్మికి బాధితుల కుటుంబ సభ్యులు వినతిపత్రం అందజేశారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం భుక్యా రవీందర్, సిర్షు అశోక్, మెగావత్ ప్రకాష్, మహమ్మద్ అఫ్జల్ ఖాన్ సుమారు ఏడు నెలల క్రితం రష్యా వెళ్లారు. ప్రముఖ ఆయిల్ కంపెనీలో భారీ వేతనంతో ఉద్యోగం ఇప్పిస్తామని ఏజెంట్లు చెప్పడంతో వారు లక్షల రూపాయలు చెల్లించి రష్యా వెళ్లినట్లు కుటుంబాలు తెలిపాయి.

అయితే రష్యా చేరుకున్న కొద్ది రోజులకే కంపెనీలో జీతాలు నిలిచిపోయాయని వారు పేర్కొన్నారు. ఇదే సమయంలో స్థానిక ఏజెంట్లు ఆర్మీలో సాధారణ హెల్పర్ ఉద్యోగాలు ఉన్నాయని, యుద్ధంతో ఎలాంటి సంబంధం ఉండదని చెప్పి యువకులను రష్యా సైన్యంలోకి తీసుకెళ్లారని ఆరోపించారు.

శిక్షణ తర్వాత యుద్ధభూమిలోకి..

సైనిక శిక్షణ పూర్తయిన అనంతరం తమ కుటుంబ సభ్యులను నేరుగా యుద్ధభూమిలోకి పంపించారని బాధితుల కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి. దీంతో తమ బిడ్డల ప్రాణాలకు ముప్పు ఏర్పడిందని, వారిని వెంటనే సురక్షితంగా భారత్‌కు తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు.

కేంద్రంతో సమన్వయానికి ఆదేశాలు

కుటుంబ సభ్యుల విజ్ఞప్తిపై గద్వాల్ విజయలక్ష్మి స్పందిస్తూ.. నలుగురు యువకులను సురక్షితంగా స్వదేశానికి రప్పించేందుకు చర్యలు ముమ్మరం చేయాలని జీఏడీ–ఎన్‌ఆర్‌ఐ (GAD-NRI) విభాగాన్ని ఆదేశించినట్లు తెలిపారు. ఈ విషయంలో ఢిల్లీలోని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో పాటు మాస్కోలోని భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని సూచించారు. బాధిత యువకుల పూర్తి వివరాలతో కూడిన లేఖను ఇప్పటికే భారత ఎంబసీకి పంపినట్లు వెల్లడించారు.

ఉపాధి కోసం విదేశాలకు వెళ్లి క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకున్న తెలంగాణ యువకులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తుందని గద్వాల్ విజయలక్ష్మి హామీ ఇచ్చారు. కుటుంబ సభ్యులు అధైర్యపడవద్దని, అధికార యంత్రాంగం నిరంతరం అందుబాటులో ఉంటూ యువకులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి కృషి చేస్తుందని తెలిపారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు