ఉపాధి కోసం రష్యా వెళ్లిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన నలుగురు తెలంగాణ యువకులు అనూహ్యంగా రష్యా సైన్యంలో చేరి యుద్ధభూమిలో చిక్కుకున్నారని వారి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆయిల్ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఏజెంట్లు నమ్మించి విదేశాలకు తీసుకెళ్లి, ఆ తర్వాత ఆర్మీలో చేర్చారని కుటుంబాలు పేర్కొన్నాయి. యువకులను సురక్షితంగా స్వదేశానికి రప్పించాలని హైదరాబాద్‌లోని సీఎం ప్రవాసీ ప్రజావాణిలో ప్రభుత్వాన్ని వేడుకున్నారు.
నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం జన్నేపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. వాగులోకి దూకిన చెల్లిని కాపాడేందుకు వెళ్లిన అన్న కూడా నీటి ఉధృతికి గల్లంతయ్యాడు. గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టగా అన్నాచెల్లెళ్ల మృతదేహాలు లభ్యమయ్యాయి.
టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాజీ మంత్రి హరీశ్ రావుపై మరోసారి విమర్శలు గుప్పించారు. హరీశ్ రావు క్షుద్రపూజలు చేశారనే సమాచారం ఉందని తాము చెప్పినందుకే తనతో పాటు కాంగ్రెస్ నాయకులకు లీగల్ నోటీసులు పంపారని అన్నారు. నోటీసులతో భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ, క్షుద్రపూజలకు ప్రసిద్ధి చెందిన దేవాలయాలను ఎందుకు సందర్శించారో హరీశ్ రావు ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్‌తో పాటు 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయగా, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
ఫేస్‌బుక్ ద్వారా మహిళలతో పరిచయం పెంచుకుని లైంగిక వేధింపులు, బెదిరింపులు, డబ్బుల వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఎస్సై కదిరే శ్రీకాంత్‌ను హనుమకొండ సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు.
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆగస్టు 1 నుంచి 15 వరకు పలు కీలక నిబంధనలు అమల్లో ఉంటాయని పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య తెలిపారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు డీజేలపై నిషేధం, డ్రోన్ల వినియోగానికి ముందస్తు అనుమతి, సభలు, ఊరేగింపులకు ప్రత్యేక నిబంధనలు విధించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడాన్ని నిషేధించడంతో పాటు నకిలీ గల్ఫ్ ఏజెంట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ‘A’ సర్టిఫికెట్ సినిమాలకు మైనర్లను అనుమతించరాదని థియేటర్లకు ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గోదావరి పుష్కరాలు-2027ను విజయవంతంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే పటిష్ట కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య అధికారులను ఆదేశించారు. భక్తుల భద్రత, ట్రాఫిక్, సీసీ కెమెరాలు, అత్యవసర సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
జిల్లాలో డ్రగ్స్ నిర్మూలన, ట్రాఫిక్ నియంత్రణ, మహిళల భద్రత, ఎన్నారై సమస్యల పరిష్కారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య పిలుపునిచ్చారు.