తిరుమల,సెప్టెంబర్ 23 (జనవాణి): శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. తిరుమల అన్నమయ్య భవన్‌లో బుధవారం ఈవో ముద్దాడ రవిచంద్రతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో బ్రహ్మోత్సవాల విశేషాలను వెల్లడించారు.
ఈ నెల 15 నుంచి 22 వరకు ఎనిమిది రోజులపాటు జరిగిన బ్రహ్మోత్సవాల్లో 5.76 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. హుండీ ద్వారా రూ.28.94 కోట్ల కానుకలు లభించగా.. 33 లక్షల లడ్డూలు విక్రయించినట్లు చైర్మన్ తెలిపారు. 21.84 లక్షల అన్నప్రసాదాలు పంపిణీ చేయగా.. 2.04 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో తిరుపతి నుంచి తిరుమలకు 13,671 ట్రిప్పుల్లో 3,92,106 మంది, తిరుమల నుంచి తిరుపతికి 13,584 ట్రిప్పుల్లో 4,97,195 మంది ప్రయాణించారు.
గరుడసేవలో అందరికీ దర్శనం
బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలకమైన గరుడసేవ రోజున తిరుమలకు వచ్చిన భక్తులందరికీ దర్శనం కల్పించినట్లు బీఆర్ నాయుడు తెలిపారు. క్యూలైన్లు, గ్యాలరీల్లో ఏర్పాట్లను టీటీడీ పాలక మండలి సభ్యులు, ఈవో, అదనపు ఈవో, సీవీఎస్వో, జిల్లా ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ప్రత్యక్షంగా పరిశీలించినట్లు చెప్పారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా పునరుద్ధరించిన శ్రీ వేంకటేశ్వర మ్యూజియం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో హీలింగ్ అండ్ డివోషన్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్, దుర్లభ్ దర్శన్ వీఆర్ అనుభవం, ఎలక్ట్రిక్ బస్సులు, నందకం యాప్, భక్తుల గ్రూప్ ఇన్సూరెన్స్ పథకాలను ప్రారంభించినట్లు తెలిపారు.
మాస్టర్ ప్లాన్‌లో భాగంగా రూ.90 కోట్లతో తిరుచానూరు ఆలయానికి అనుసంధాన రోడ్ల అభివృద్ధికి చర్యలు చేపట్టామని, అలిపిరి సమీపంలో 50 ఎకరాల్లో అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు.
295 కళాబృందాల ప్రదర్శనలు
బ్రహ్మోత్సవాల్లో 20 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం నుంచి 295 కళాబృందాలకు చెందిన 7,871 మంది కళాకారులు వివిధ కళారూపాలను ప్రదర్శించారు. గరుడసేవ రోజున 14 రాష్ట్రాలకు చెందిన 32 కళాబృందాల నుంచి 916 మంది కళాకారులు పాల్గొన్నారు.
తొలిసారిగా విదేశీ కళాబృందాల ప్రదర్శనలు నిర్వహించగా.. జర్మనీ, సింగపూర్ కళాకారుల ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఉత్తమ ప్రదర్శనలు ఇచ్చిన నాలుగు కళాబృందాలను ప్రతిరోజూ టీటీడీ ఈవో సన్మానించారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో 60 టన్నుల పుష్పాలు, 4 లక్షల కట్‌ఫ్లవర్స్, 80 వేల సీజనల్ ఫ్లవర్స్ వినియోగించి పుష్పాలంకరణ చేపట్టారు. వాహనసేవలను భక్తులు సులభంగా వీక్షించేందుకు 36 భారీ డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఎస్వీబీసీ ద్వారా బ్రహ్మోత్సవాల ప్రత్యక్ష ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా హెచ్‌డీ నాణ్యతతో అందించారు.
4 వేల మంది శ్రీవారి సేవకులు
భక్తులకు సేవలందించేందుకు బ్రహ్మోత్సవాల్లో 4 వేల మంది శ్రీవారి సేవకులు విధులు నిర్వహించారు. వైద్య సేవల కోసం 50 మంది వైద్యులు, 150 మంది పారామెడికల్ సిబ్బంది, 16 అంబులెన్సులను అందుబాటులో ఉంచారు.
భద్రత కోసం 3 వేల మంది పోలీసులు, 2,400 మంది విజిలెన్స్ సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. గరుడసేవ రోజున అదనంగా మరో వెయ్యి మంది పోలీసులు సేవలందించారు. అదే రోజు 3,500 మంది పారిశుద్ధ్య సిబ్బంది విధులు నిర్వహించారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా సుమారు 173 టన్నుల తడి, పొడి చెత్తను వేరు చేసి డంపింగ్ యార్డుకు తరలించారు. తిరుపతిలో వివిధ విభాగాలకు చెందిన సుమారు 600 మంది టీటీడీ ఉద్యోగులు సేవలందించారు.
బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన అర్చకులు, అధికారులు, ఉద్యోగులు, జిల్లా, పోలీసు యంత్రాంగం, శ్రీవారి సేవకులు, పారిశుద్ధ్య, వైద్య సిబ్బంది, మీడియా ప్రతినిధులు, భక్తులకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా భక్తులకు చేరవేసిన మీడియా సంస్థలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.




















