రాజన్న సిరిసిల్ల :దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.99.40 కోట్ల నిధులను మంజూరు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులకు మరింత ఊపు రానుంది.
ప్రభుత్వం ఇప్పటికే 2023-24 బడ్జెట్‌లో రూ.50 కోట్లు, 2024-25 బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించింది. తాజాగా విడుదల చేసిన రూ.99.40 కోట్లతో కలిపి మొత్తం రూ.249.40 కోట్ల నిధులు ఆలయ అభివృద్ధి కోసం మంజూరైనట్లు అధికారులు వెల్లడించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటికే సుమారు 45 శాతం పనులు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. కొత్తగా విడుదలైన నిధులతో మిగిలిన పనులను మరింత వేగంగా పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఆలయ పరిసరాల అభివృద్ధి, భక్తులకు మెరుగైన వసతులు, మౌలిక సదుపాయాల విస్తరణ, యాత్రికుల సౌకర్యాల పెంపు వంటి పనులు ఈ ప్రాజెక్టులో భాగంగా కొనసాగుతున్నాయి.
ఈ సందర్భంగా నిధుల మంజూరుకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజాప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.
తాజా నిధుల విడుదలతో రాజన్న ఆలయ అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తవుతాయని, భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.




















