ఫైర్ బ్రాండ్ కొండా సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ విజయశాంతి? హుటాహుటిన ఢిల్లీకి రాములమ్మ

తెలంగాణ కాంగ్రెస్‌లో కేబినెట్ విస్తరణపై ఊహాగానాలు ఊపందుకున్న వేళ ఎమ్మెల్సీ విజయశాంతి హుటాహుటిన ఢిల్లీ వెళ్లడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. కొండా సురేఖ స్థానంలో బీసీ మహిళా నేతగా విజయశాంతికి అవకాశం దక్కే అవకాశముందనే ప్రచారం సాగుతోంది.

5 సెప్టెంబర్, 2026 1:54 PM•ByNarender Kumar Nangunoori

Share this article

ఫైర్ బ్రాండ్  కొండా సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్  విజయశాంతి? హుటాహుటిన ఢిల్లీకి రాములమ్మ

హైదరాబాద్, సెప్టెంబర్ 5 (జనవాణి): తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కేబినెట్‌లో ఖాళీగా ఉన్న స్థానాల భర్తీతో పాటు మంత్రి వర్గ విస్తరణపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ సమయంలో ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ విజయశాంతి హుటాహుటిన ఢిల్లీ వెళ్లడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ప్రస్తుతం కేబినెట్‌లో మూడు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించిన నేపథ్యంలో ఆమె స్థానంలో బీసీ మహిళా నేతకు అవకాశం కల్పించాలనే ఆలోచన అధిష్టానం స్థాయిలో ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ సమీకరణాల్లో విజయశాంతి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

కొండా సురేఖ స్థానాన్ని భర్తీ చేస్తారా?

తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా సురేఖకు ఫైర్‌బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఆమె స్థానాన్ని భర్తీ చేయాలంటే అదే స్థాయిలో రాజకీయంగా దూకుడుగా వ్యవహరించే మహిళా నేత అవసరమనే అభిప్రాయం పార్టీలో ఉందని ప్రచారం జరుగుతోంది. బీసీ మహిళా నేతగా గుర్తింపు, సినీ నేపథ్యంతో వచ్చిన ప్రజాదరణ, రాజకీయ అనుభవం, వాగ్ధాటి వంటి అంశాలు విజయశాంతికి కలిసొచ్చే అవకాశాలుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున విజయశాంతి సేవలను పార్టీ మరింత సమర్థంగా వినియోగించుకోవాలని అధిష్టానం భావిస్తోందనే ప్రచారం కూడా ఉంది.

ఢిల్లీ టూర్‌తో పెరిగిన ఉత్కంఠ

కేబినెట్ విస్తరణపై చర్చ జరుగుతున్న సమయంలోనే విజయశాంతి ఢిల్లీ వెళ్లడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆమెకు అధిష్టానం నుంచి పిలుపు వచ్చిందా? లేక మంత్రి పదవి కోసం పార్టీ పెద్దలను కలిసేందుకే హస్తినకు వెళ్లారా? అనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో సాగుతోంది. అయితే విజయశాంతి ఢిల్లీ పర్యటనకు అసలు కారణం అధికారికంగా వెల్లడికాలేదు. దీంతో ఆమె పర్యటనపై రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు మరింత పెరిగాయి.

విజయశాంతికి కలిసొచ్చే అంశాలు

2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లోకి తిరిగి వచ్చిన విజయశాంతికి 2025 మార్చిలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కింది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతకాలం ఎలాంటి పదవి దక్కకపోయినా ఆమె బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయలేదు. గ్రూపు రాజకీయాలకు దూరంగా ఉండటం, అధిష్టానం నిర్ణయాలకు అనుగుణంగా వ్యవహరించడం, అవసరమైన సందర్భాల్లో మాత్రమే మీడియా ముందుకు రావడం వంటి అంశాలు ఆమెకు అనుకూలంగా మారవచ్చనే చర్చ ఉంది. గతంలో కాంగ్రెస్ అగ్రనేతలతో ఉన్న పరిచయాలు కూడా ఆమెకు ప్లస్ పాయింట్‌గా మారవచ్చని భావిస్తున్నారు.

vijayashanti

ఇవే విజయశాంతికి మైనస్ పాయింట్లు

అయితే విజయశాంతికి మంత్రి పదవి దక్కే విషయంలో కొన్ని ప్రతికూల అంశాలు కూడా ఉన్నాయి. 2023 ఎన్నికల తర్వాత ఆమె పార్టీలో పెద్దగా యాక్టివ్‌గా కనిపించలేదనే విమర్శ ఉంది. చాలా కాలంగా నియోజకవర్గాల్లో పార్టీ కోసం పనిచేస్తున్న ఎమ్మెల్యేలకు మంత్రి పదవి దక్కకుండా, ఎమ్మెల్సీగా వచ్చిన వెంటనే విజయశాంతికి అవకాశం ఇస్తే అసంతృప్తి వ్యక్తమయ్యే అవకాశం ఉందనే చర్చ ఉంది. అదే సమయంలో బీసీ కోటాలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌తో పాటు ఆదీ శ్రీనివాస్ వంటి నేతల పేర్లు కూడా మంత్రి పదవుల రేసులో వినిపిస్తున్నాయి. దీంతో విజయశాంతికి పోటీ గట్టిగానే ఉండే అవకాశం ఉంది.

సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం

విజయశాంతి 1998లో బీజేపీలో చేరి రాజకీయాల్లోకి ప్రవేశించారు. అనంతరం తల్లి తెలంగాణ పార్టీని స్థాపించి, ఆ తర్వాత టీఆర్ఎస్‌లో చేరారు. 2009లో మెదక్ లోక్‌సభ స్థానం నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. కేసీఆర్‌తో విభేదాల నేపథ్యంలో 2014లో టీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. 2020లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన ఆమె.. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు.

ఈ నేపథ్యంలో కేబినెట్ విస్తరణ సమయంలో విజయశాంతి ఢిల్లీ పర్యటన తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త రాజకీయ సమీకరణాలకు సంకేతమా? అనే చర్చ ఆసక్తికరంగా మారింది. అయితే ఆమెకు మంత్రి పదవి దక్కుతుందా లేదా అన్నది కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు