Golden City of India | దేశంలో కొన్ని నగరాలు తమ చారిత్రక వైభవంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయి. మరికొన్ని ప్రకృతి ప్రసాదించిన అందాలతో ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించాయి. అలాంటి అరుదైన నగరాల్లో రాజస్థాన్‌లోని జైసల్మేర్ ఒకటి. ‘గోల్డెన్ సిటీ ఆఫ్ ఇండియా’గా ప్రసిద్ధి చెందిన ఈ ఎడారి నగరంలో బంగారు గనులేమీ లేవు. అపార ధనసంపదతో సైతం ఈ పేరు రాలేదు. ప్రకృతి అందాలు, శిల్పకళా వైభవం కలిసిన అపూర్వ దృశ్యమే జైసల్మేర్‌కు ఈ ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. శతాబ్దాల చరిత్రను ఒడిసిపట్టుకుని నిలిచిన ఈ నగరం నేటికీ దేశ విదేశాల నుంచి వేలాది మంది పర్యాటకులను ఆకర్షిస్తూనే ఉన్నది..
ఆ ప్రత్యేకతతోనే పేరు..
జైసల్మేర్‌కు ‘గోల్డెన్ సిటీ’ అనే పేరు రావడానికి ప్రధాన కారణం అక్కడ విరివిగా లభించే పసుపు వర్ణం కలిగిన ఇసుకరాయి. నగరంలోని కోటలు, రాజప్రాసాదాలు, హవేలీలు, దేవాలయాలు సహా అనేక చారిత్రక కట్టడాలు ఈ రాతితోనే నిర్మితమయ్యాయి. ముఖ్యంగా ఉదయం సూర్యోదయం వేళ, సాయంత్రం అస్తమయ సమయంలో సూర్యకిరణాలు ఈ నిర్మాణాలపై పడితే అవన్నీ బంగారు మెరుపులతో వెలిగిపోతాయి. ఎడారి మధ్యలో బంగారంతో తీర్చిదిద్దిన నగరంలా కనిపించే ఈ అపూర్వ దృశ్యమే ‘గోల్డెన్ సిటీ’ అనే బిరుదుకు మూలం.
జీవంతో కళకళలాడే సోనార్ కిల్లా
జైసల్మేర్ అంటే ముందుగా గుర్తుకొచ్చేది అక్కడి సోనార్ కిల్లా. 1156లో రాజ్‌పుత్ పాలకుడు రావల్ జైసల్ నిర్మించిన ఈ కోట నగరానికి గుండెకాయగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక చారిత్రక కోటలు కేవలం సందర్శన స్థలాలుగా మాత్రమే మిగిలిపోగా, జైసల్మేర్ కోట మాత్రం ఇప్పటికీ జీవంతో కళకళలాడుతోంది. వేలాది మంది ప్రజలు ఈ కోటలోనే నివసిస్తున్నారు. ఇళ్లతో పాటు ఆలయాలు, దుకాణాలు, హస్తకళల విక్రయ కేంద్రాలు, చిన్న వ్యాపారాలు నిత్యజీవితంలో భాగంగా కొనసాగుతుండడం దీని విశిష్టత. అందుకే ప్రపంచంలో ఇప్పటికీ జనావాసం కొనసాగుతున్న అరుదైన కోటల్లో దీనికి ప్రత్యేక స్థానం ఉంది.
వాణిజ్య మార్గాల్లో కీలక కేంద్రం
పర్యాటక కేంద్రంగా పేరుపొందకముందే జైసల్మేర్ చరిత్రలో ప్రముఖ స్థానాన్ని సంపాదించింది. ఒకప్పుడు భారత్‌ను పశ్చిమాసియా దేశాలతో అనుసంధానించిన ప్రాచీన వాణిజ్య మార్గాల్లో ఇది కీలక కేంద్రంగా ఉండేది. వ్యాపార బృందాలు, ఒంటెల కారవాన్లు, యాత్రికులు ఈ ప్రాంతం మీదుగానే ప్రయాణించేవారు. ఆ రాకపోకలతో జైసల్మేర్ ఆర్థికంగా అభివృద్ధి చెందడమే కాకుండా.. వివిధ ప్రాంతాల సంస్కృతులు, సంప్రదాయాలు కూడా ఇక్కడ కలిసిపోయాయి. అందుకే ఈ నగరంలో రాజస్థానీ సంస్కృతితో పాటు పలు ప్రాంతాల ప్రభావం కూడా కనిపిస్తుంది.
చరిత్రతో పాటు సంస్కృతికీ నిలయం
జైసల్మేర్ ప్రత్యేకత కేవలం కోటలు, రాజభవనాలకే పరిమితం కాదు. రాజస్థానీ జానపద సంగీతం, రంగురంగుల నృత్యాలు, సంప్రదాయ హస్తకళలు, స్థానిక ఉత్సవాలు ఈ నగర సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబిస్తాయి. ఇరుకైన వీధులు, శిల్పకళతో అలరించే హవేలీలు, శతాబ్దాల నాటి దేవాలయాలు, ఎడారి జీవనశైలి నేటికీ పాతకాలపు జ్ఞాపకాలను సజీవంగా నిలిపాయి. థార్ ఎడారి ఒడిలో చరిత్ర, ప్రకృతి, సంస్కృతి ఒకే చోట కలిసిన అరుదైన నగరంగా జైసల్మేర్ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. అందుకే ప్రతి ఏడాది ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే పర్యాటకుల అడుగులతో ఈ ‘గోల్డెన్ సిటీ’ సందడిగా మారుతోంది.




















