IND Vs SL | టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు ఆయన దూరమయ్యారు. ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా ఎడమ మోకాలికి అయిన గాయం నుంచి బుమ్రా ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో సెలెక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన స్థానంలో జమ్ముకశ్మీర్ యువ పేసర్ ఆకిబ్ నబీకి తొలిసారి భారత టెస్టు జట్టులో చోటు కల్పించారు. జమ్ముకశ్మీర్‌కు చెందిన యువ ఫాస్ట్ బౌలర్ ఆకిబ్ నబీ గత రెండు రంజీ సీజన్లలో నిలకడైన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇప్పటివరకు రంజీ ట్రోఫీలో మొత్తం 104 వికెట్లు పడగొట్టి తన ప్రతిభను చాటుకున్నాడు. ముఖ్యంగా 2025-26 రంజీ ట్రోఫీ సీజన్‌లో ఆకిబ్ నబీ అద్భుతంగా రాణించాడు. ఏకంగా 60 వికెట్లు తీసి జమ్ముకశ్మీర్ జట్టు తొలి రంజీ ట్రోఫీ టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. దేశవాళీ క్రికెట్‌లో స్థిరమైన ప్రదర్శనకు గుర్తింపుగా ఇప్పుడు జాతీయ జట్టులో అవకాశం లభించింది.
ఇండియా ‘ఎ’ పర్యటనలోనూ ఆకట్టుకున్నాడు..
ఇటీవల ఆకిబ్ నబీ భారత ‘ఎ’ జట్టుతో కలిసి శ్రీలంక పర్యటనకు వెళ్లాడు. అక్కడ రెండు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో ఆరు వికెట్లు పడగొట్టి తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు. ఆ ప్రదర్శనే అతడికి సీనియర్ జట్టులో స్థానం దక్కేలా చేసింది. శ్రీలంక పర్యటనలో భారత టెస్టు జట్టుకు యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ నాయకత్వం వహించనున్నాడు. కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. వికెట్ కీపర్లుగా రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఫిట్‌నెస్ క్లియరెన్స్ వస్తే సాయి సుదర్శన్ కూడా జట్టులో భాగం కానున్నాడు. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తిరిగి టెస్టు జట్టులోకి వచ్చాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన 33 ఏళ్ల స్పిన్ ఆల్‌రౌండర్ సారంశ్ జైన్ తొలిసారి జట్టులో చోటు దక్కించుకున్నాడు.
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ దిశగా కీలక సిరీస్..
శ్రీలంకతో జరిగే ఈ టెస్టు సిరీస్ భారత జట్టుకు ఎంతో కీలకం కానుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ చేరాలంటే ఈ సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది. ఇటీవల స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత్ 0-2తో ఓటమి పాలవడం జట్టుకు నిరాశ కలిగించింది. ఆ లోటును అధిగమించి విజయాల బాట పట్టాలని గిల్ సేన లక్ష్యంగా పెట్టుకుంది.
శ్రీలంక టెస్టు సిరీస్‌కు భారత జట్టు
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్ (ఫిట్‌నెస్‌పై ఆధారపడి), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మనవ్ సుతార్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సారంశ్ జైన్, ఆకిబ్ నబీ.




















