పల్నాడు జిల్లాలో క్షుద్రపూజల పేరుతో ఇద్దరిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నరసరావుపేటకు చెందిన నిఖిల్.. నిద్రిస్తున్న వారిని బండరాయితో హత్య చేసి, మృతదేహం నుంచి కొన్ని శరీర భాగాలను తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసు దర్యాప్తులో 2018లో జరిగిన మరో హత్యలోనూ నిఖిల్ ప్రమేయం ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. సీసీటీవీ, సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌కు బానిసైన గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన వెన్న దుర్గా దినేష్ అలియాస్ సాయి జీవితం అనేక మలుపులు తిరిగింది. బెట్టింగ్‌లో చేసిన అప్పులు తీర్చేందుకు కిడ్నీ అమ్ముకున్నా అప్పులు తీరలేదు. చివరకు చోరీల బాట పట్టిన సాయి.. జైలులో పరిచయమైన వారికి దొంగతనాల్లో శిక్షణ ఇచ్చి ముఠాగా ఏర్పడి వరుస చోరీలకు పాల్పడ్డాడు. పల్నాడు ప్రాంతంలో జరిగిన భారీ చోరీ కేసులో సాయితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.
పల్నాడు జిల్లా కారంపూడి మండలంలో హసీనా అనే యువతిని ప్రియుడు బాలసైదులు కత్తితో హత్య చేసి, మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఉద్యోగంలో చేరిన తర్వాత ఆమె తనను పట్టించుకోవడం లేదనే అనుమానంతో ఈ దారుణానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది.