అప్పుల కోసం కిడ్నీ అమ్ముకున్నాడు.. తీరని అప్పులతో దొంగగా మారాడు

ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌కు బానిసైన గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన వెన్న దుర్గా దినేష్ అలియాస్ సాయి జీవితం అనేక మలుపులు తిరిగింది. బెట్టింగ్‌లో చేసిన అప్పులు తీర్చేందుకు కిడ్నీ అమ్ముకున్నా అప్పులు తీరలేదు. చివరకు చోరీల బాట పట్టిన సాయి.. జైలులో పరిచయమైన వారికి దొంగతనాల్లో శిక్షణ ఇచ్చి ముఠాగా ఏర్పడి వరుస చోరీలకు పాల్పడ్డాడు. పల్నాడు ప్రాంతంలో జరిగిన భారీ చోరీ కేసులో సాయితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.

30 సెప్టెంబర్, 2026 3:52 PM•ByNarender Kumar Nangunoori

Share this article

అప్పుల కోసం కిడ్నీ అమ్ముకున్నాడు.. తీరని అప్పులతో దొంగగా మారాడు

గుంటూరు,సెప్టెంబర్ 30 (జనవాణి): ఆన్‌లైన్ బెట్టింగ్ సరదాగా మొదలై ఓ వ్యక్తి జీవితాన్ని పూర్తిగా ఛిన్నాభిన్నం చేసింది. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన వెన్న దుర్గా దినేష్ అలియాస్ సాయి బెట్టింగ్‌కు బానిసై లక్షల రూపాయల అప్పుల్లో కూరుకుపోయాడు. అప్పులు తీర్చేందుకు చివరకు తన కిడ్నీని అమ్ముకున్నాడు. అయినా అప్పుల భారం తగ్గకపోవడంతో చోరీల బాట పట్టాడు. బెట్టింగ్ ప్రపంచంలో అతడిని ‘సింగిల్ కిడ్నీ సాయి’గా పిలిచేవారు.

సాయిపై ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇప్పటికే 12 చోరీ కేసులు నమోదయ్యాయి. పలుమార్లు జైలుకు వెళ్లిన అతడికి అక్కడ ఎడ్లపాడుకు చెందిన గుంజి యేసురాజా పరిచయమయ్యాడు. జైలులోనే యేసురాజాకు దొంగతనాలు చేయడం గురించి సాయి శిక్షణ ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు.

జైలు నుంచి బయటకు వచ్చాక ముఠాగా

జైలు నుంచి విడుదలైన తర్వాత సాయి, యేసురాజా కలిసి తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడ్డారు. నాదెండ్ల మండలం గణపవరంలో రెండు ఇళ్లలో, చిలకలూరిపేటలో మరో ఇంట్లో చోరీలు చేశారు. ఈ క్రమంలో ఎడ్లపాడుకు చెందిన బచ్చు పార్వతి నాగలక్ష్మి హైదరాబాద్‌లోని తన కుమారుడి ఇంటికి వెళ్లిన విషయాన్ని గమనించారు. సాయి, యేసురాజా, షేక్ నాగుర్ భాష కలిసి ఆమె ఇంటి తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. అక్కడి నుంచి 50 సవర్ల బంగారు ఆభరణాలు, 5.4 కిలోల వెండి, రూ.2 లక్షల నగదు అపహరించారు.

సీసీ కెమెరాల ఆధారంగా పోలీసుల దర్యాప్తు

పల్నాడు గ్రామీణ ప్రాంతాల్లో వరుసగా చోరీలు జరగడంతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. చోరీలు జరిగిన ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. ఓ పెట్రోల్ బంక్ వద్ద దుప్పటి ముసుగు వేసుకుని వెళ్తున్న వ్యక్తిని గుర్తించారు. పలు ప్రాంతాల్లోనూ ఇదే తరహాలో దుప్పటి ముసుగు ధరించిన వ్యక్తి కనిపించడంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు కొనసాగించారు. చివరకు యేసురాజాను అదుపులోకి తీసుకుని విచారించగా సాయి పేరు బయటపడింది.

వలపన్ని సాయి అరెస్ట్

యేసురాజా ద్వారా వ్యూహాత్మకంగా వలపన్నిన పోలీసులు సెప్టెంబర్ 18న సింగిల్ కిడ్నీ సాయిని అరెస్టు చేశారు. అతడి నుంచి చోరీకి గురైన 50 సవర్ల బంగారం, 5.4 కిలోల వెండి, రూ.2 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సాయి (A1), యేసురాజా (A2), షేక్ నాగుర్ భాష (A3)లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

బెట్టింగ్ వ్యసనం అప్పులకు, అప్పులు కిడ్నీ అమ్మకానికి, చివరకు నేరాలకు దారితీసిన సాయి వ్యవహారం.. వ్యసనాలు వ్యక్తి జీవితంపై చూపే తీవ్ర ప్రభావానికి ఒక ఉదాహరణగా నిలిచింది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు