హిందూ ధర్మం, నినాదాల దుర్వినియోగంపై తాను చేసిన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో తీవ్ర ట్రోలింగ్ ఎదుర్కొంటున్న నటి అనసూయ భరద్వాజ్ తాజాగా స్పందించారు. ఈ వివాదంపై తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో సుదీర్ఘ వివరణ ఇచ్చారు. తన మాటలను కొందరు కావాలనే వక్రీకరించి, సనాతన ధర్మాన్ని అవమానించినట్లుగా ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను సనాతన ధర్మాన్ని పాటించే హిందువునని, హనుమంతుడిపై తనకు అపారమైన భక్తి ఉందని అనసూయ స్పష్టం చేశారు. తనపై అసభ్యకర వ్యాఖ్యలు, వ్యక్తిగత దాడులు, బెదిరింపులకు పాల్పడుతున్న కొంతమంది వ్యక్తుల ప్రవర్తనను మాత్రమే తాను ప్రశ్నించానని తెలిపారు. తన వ్యాఖ్యలు ఏ మతాన్ని లేదా వర్గాన్ని కించపరిచే ఉద్దేశంతో చేసినవి కాదని పేర్కొన్నారు.
ధైర్యంగా ఉండటం, నిజం వైపు నిలబడటం, తప్పును తప్పు అని చెప్పడం, ఎదుటివారిని గౌరవించడం.. ఇవన్నీ నా ధర్మమే నాకు నేర్పింది అని అనసూయ పేర్కొన్నారు. హనుమంతుడు తనకు ధైర్యం, బలానికి స్ఫూర్తి అని చెప్పారు. అన్యాయం జరిగినప్పుడు మౌనంగా ఉండలేనని స్పష్టం చేశారు. తన మాటల నుంచి అసలు సందర్భాన్ని తొలగించి సోషల్ మీడియాలో ప్రచారం చేయడం సరికాదని ఆమె అన్నారు. ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు, సగం సగం కథనాలను చూసి తనపై ఒక నిర్ణయానికి రావద్దని నెటిజన్లను కోరారు. పూర్తి విషయాలు తెలుసుకున్న తర్వాతే అభిప్రాయం ఏర్పరుచుకోవాలని సూచించారు.
మతం ఆధారంగా ఎవరినీ తప్పుపట్టను. వేధించే ప్రవర్తనను మాత్రమే ప్రశ్నిస్తాను. ఎవరు ఏ మతానికి చెందిన వారైనా వేధింపు వేధింపే.. అగౌరవం అగౌరమే అని అనసూయ తన పోస్ట్‌లో స్పష్టం చేశారు. తన విశ్వాసాలపై గర్వంగా ఉందని, తాను హిందువునని చెప్పుకోవడంలో ఎలాంటి సంకోచం లేదని ఆమె పేర్కొన్నారు. చివరగా జై శ్రీరామ్.. జై హనుమాన్ అంటూ తన వివరణను ముగించారు. ప్రస్తుతం అనసూయ చేసిన ఈ క్లారిటీ పోస్ట్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.




















