కొచ్చి,సెప్టెంబర్ 30 (జనవాణి): కాంగ్రెస్ పార్టీని వీడి ఇతర రాజకీయ పార్టీలను ఏర్పాటు చేసిన నేతలు, ఇతర పార్టీల్లో చేరిన మాజీ కాంగ్రెస్ నాయకులు తిరిగి హస్తం గూటికి రావాలని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ను వీడిన నేతలంతా తిరిగి పార్టీలో చేరి కాంగ్రెస్ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లేందుకు కలిసి పనిచేయాలని కోరారు. కేరళలోని కొచ్చిలో జరుగుతున్న ఇండియా టుడే కాన్‌క్లేవ్ సౌత్ 2026లో బుధవారం పాల్గొన్న భట్టి ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ను వీడి వెళ్లిన పాత నేతలంతా తిరిగి పార్టీలో చేరితే తాను సంతోషిస్తానని భట్టి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ను వీడిన నాయకులు తిరిగి రావాలని విజ్ఞప్తి చేశారు.
జగన్, మమతా, పవార్‌లకు పిలుపు
కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లి సొంత పార్టీలు ఏర్పాటు చేసిన నేతలను భట్టి విక్రమార్క ఈ సందర్భంగా ప్రస్తావించారు. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌ను ఏర్పాటు చేసిన మమతా బెనర్జీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసిన శరద్ పవార్‌తో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్‌తో కలిసి పనిచేయాలని ఆయన కోరారు.
వైఎస్ రాజశేఖరరెడ్డితో తనకు ఉన్న అనుబంధాన్ని కూడా భట్టి గుర్తుచేసుకున్నారు. తాను వైఎస్సార్‌తో కలిసి పనిచేశానని అయితే ఆయన కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి పనిచేయలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ను వీడి వెళ్లిన నేతలు తిరిగి వస్తే పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కలిసి పనిచేయవచ్చని పేర్కొన్నారు.
ఎస్ఐఆర్‌పై ఎన్నికల సంఘంపై విమర్శలు
ఎన్నికల సంఘం చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పైనా భట్టి విక్రమార్క విమర్శలు చేశారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో నమ్మకం కల్పించడం ఎన్నికల సంఘం ప్రధాన బాధ్యత అని అన్నారు. ఎస్ఐఆర్ సందర్భంగా పెద్ద సంఖ్యలో ఓటర్ల పేర్లు తొలగిస్తున్నారనే ఆరోపణలతో ప్రజల్లో అనుమానాలు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. ఓటింగ్ ప్రక్రియపై సందేహాలు ఉంటే బ్యాలెట్ పేపర్ల వినియోగం ద్వారా ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని భట్టి అభిప్రాయపడ్డారు. ఎస్ఐఆర్ విషయంలో ఎన్నికల సంఘంలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయంటూ వచ్చిన వార్తలు కూడా సందేహాలకు కారణమయ్యాయని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
‘5 గ్యారంటీలు ఉచిత పథకాలు కావు’
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఐదు గ్యారంటీలను ఉచిత పథకాలుగా పేర్కొనడాన్ని కూడా భట్టి విక్రమార్క వ్యతిరేకించారు. ఈ పథకాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా ప్రయోజనం చేకూరుస్తాయని ఆయన పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి పథకాలను ఆయన ప్రస్తావించారు. రైతు భరోసా కింద ఎకరాకు రూ.12 వేల చొప్పున అందిస్తున్నామని చెబుతూ రైతులకు ఆర్థిక సహాయం అందితే సాగులో పెట్టుబడులు పెరిగి ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంటుందని వివరించారు.
కేంద్ర పన్నుల వాటాపైనా వ్యాఖ్యలు
తెలంగాణకు కేంద్ర పన్నుల్లో దక్కుతున్న వాటిపైనా భట్టి విక్రమార్క మాట్లాడారు. రాష్ట్రం కేంద్రానికి చెల్లిస్తున్న పన్నులతో పోలిస్తే తిరిగి వచ్చే వాటా తక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఇదే అంశంపై తెలంగాణతో పాటు ఇతర దక్షిణాది రాష్ట్రాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని తెలిపారు. భారతదేశం సమాఖ్య వ్యవస్థలో ఉందని రాష్ట్రాలు అందిస్తున్న ఆదాయానికి అనుగుణంగా న్యాయమైన వాటా దక్కేలా కేంద్రం వ్యవహరించాలని భట్టి కోరారు. ఈ విషయంలో కేంద్రం సమాఖ్య స్ఫూర్తిని పాటించాలని అన్నారు.
రేవంత్‌తో సంబంధాలపై భట్టి
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో తన సంబంధాలపై కూడా భట్టి విక్రమార్క స్పందించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సమష్టిగా పనిచేస్తోందని చెప్పారు. నేతలంతా కలిసి చర్చించి నిర్ణయాలు తీసుకుంటూ కాంగ్రెస్ సిద్ధాంతాలకు అనుగుణంగా పాలన కొనసాగిస్తున్నామని తెలిపారు. తన రాజకీయ భవిష్యత్తు, నాయకత్వ ఆకాంక్షలను కుల సమీకరణాలతో ముడిపెట్టడం సరికాదని భట్టి అన్నారు. కాంగ్రెస్‌లో పనిచేస్తున్న ప్రతి నాయకుడు, కార్యకర్త పార్టీకి చెందినవారేనని తనను కులం ఆధారంగా చూడకూడదని పేర్కొన్నారు.
Loading Tweet...




















