రాజమహేంద్రవరంలో వైద్య విద్యార్థులను ఢీకొట్టిన కారు.. ఘటనపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ సీరియస్

రాజమహేంద్రవరంలో మద్యం మత్తులో కారు నడుపుతూ ఇద్దరు వైద్య విద్యార్థులను ఢీకొట్టి తీవ్రంగా గాయపరిచిన ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

7 ఆగస్టు, 2026 8:13 PM•ByRalin

Share this article

రాజమహేంద్రవరంలో వైద్య విద్యార్థులను ఢీకొట్టిన కారు.. ఘటనపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ సీరియస్

రాజమహేంద్రవరం, ఆగస్టు 7 (జనవాణి): రాజమహేంద్రవరంలో మద్యం మత్తులో కారు నడుపుతూ ఇద్దరు వైద్య విద్యార్థులను ఢీకొట్టి తీవ్రంగా గాయపరిచిన ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో వేగంగా స్పందించిన పోలీసులు.. ప్రమాదానికి కారణమైన ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారికి 14 రోజుల రిమాండ్‌ విధించింది

అసలేం జరిగిందంటే..

ప్రకాశ్‌నగర్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోరంపూడి సాయినగర్‌కు చెందిన సురవరపు దుష్యంత్‌, లాలాచెరువుకు చెందిన ఆండ్రూ విలియం జోసెఫ్‌ ఈ నెల 3న మద్యం మత్తులో కారును నిర్లక్ష్యంగా నడుపుతూ రాజమహేంద్రవరంలోని ప్రసాద్‌ ఆదిత్య మాల్‌ గేటు వద్ద ద్విచక్రవాహనంపై వెళ్తున్న వైద్య విద్యార్థులు ప్రియాంక, ఉమేష్‌ను ఢీకొట్టారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ప్రమాదంలో ప్రియాంక తలకు తీవ్ర గాయాలయ్యాయి. తొలుత రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందించగా, పరిస్థితి విషమించడంతో బుధవారం ఆమెను సికింద్రాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మరో వైద్య విద్యార్థి ఉమేష్‌కు స్వల్ప గాయాలు కావడంతో చికిత్స కొనసాగుతోంది.

సీఎం చంద్రబాబు ఆగ్రహం

ఈ ప్రమాద ఘటనను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా పరిగణించారు. నిర్లక్ష్యంగా మద్యం మత్తులో వాహనాలు నడిపి అమాయకుల ప్రాణాలతో చెలగాటం ఆడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని సూచించారు.

డీఐజీతో ఫోన్‌లో మాట్లాడిన డిప్యూటీ సీఎం

రాజమహేంద్రవరం ప్రమాద ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి కారణమైన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏలూరు రేంజ్‌ డీఐజీతో ఫోన్‌లో మాట్లాడిన ఆయన, ఈ కేసును అత్యంత సీరియస్‌గా తీసుకుని చట్టప్రకారం చర్యలు వేగవంతం చేయాలని సూచించారు.

అలాగే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వైద్య విద్యార్థులు ప్రియాంక, ఉమేష్‌ల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. బాధితులకు అవసరమైన మెరుగైన వైద్య చికిత్స అందేలా చూడాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం.

నిందితులకు 14 రోజుల రిమాండ్‌

ఘటనపై కేసు నమోదు చేసిన ప్రకాశ్‌నగర్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులు సురవరపు దుష్యంత్‌, ఆండ్రూ విలియం జోసెఫ్‌లను అరెస్ట్‌ చేశారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఇద్దరికీ 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది.

Ralin

Written By

Ralin

Reporter

Ralin is an experienced journalist with over 12 years of experience in journalism and digital media. Ralin has worked with leading Telugu media organizations, including Eenadu, Andhra Jyothi, and Namasthe Telangana, and specializes in news writing, digital journalism, SEO content, editing, and feature writing.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు