విజయనగరం, ఆగస్టు 1: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రశంసించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం కీలకమని పేర్కొన్నారు. భోగాపురం విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన చంద్రబాబు.. ఉత్తరాంధ్ర ప్రజల ఎన్నో ఏళ్ల కల నేడు సాకారమైందని, ఈ విమానాశ్రయం ప్రాంత అభివృద్ధికి కొత్త అవకాశాలను తీసుకువస్తుందని అన్నారు.
రాష్ట్ర విభజన తర్వాత తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాని మోదీ ఆక్సిజన్‌లా అండగా నిలిచారని కొనియాడారు. రాజధాని అమరావతికి నిధులు, పోలవరం ప్రాజెక్టు, విశాఖ రైల్వే జోన్, విశాఖ ఉక్కు వంటి కీలక అంశాల్లో కేంద్రం సహకరించిందని గుర్తు చేశారు.
రైతులకు చంద్రబాబు ప్రత్యేక కృతజ్ఞతలు..
భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. రైతులకు పాదాభివందనం చేస్తున్నాను. వారి త్యాగం వల్లే ఈ చారిత్రాత్మక ప్రాజెక్టు సాధ్యమైంది అని అన్నారు.
ఎర్రబస్సు కూడా రాదని ఎగతాళి చేసిన రోజులు..
ఈ ప్రాంతానికి ఒకప్పుడు ఎర్రబస్సు కూడా రాదని ఎగతాళి చేసిన రోజులు ఉన్నాయని, కానీ ఇప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కావడం ఉత్తరాంధ్ర అభివృద్ధిలో చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టాయని, రానున్న రోజుల్లో మరిన్ని ప్రాజెక్టుల ద్వారా భారీ పెట్టుబడులు వస్తాయని వెల్లడించారు. దీంతో ఉపాధి అవకాశాలు పెరిగి, వలసలు తగ్గడమే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి ప్రజలు వచ్చే పరిస్థితి ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మోదీ నాయకత్వంపై ప్రశంసలు
దేశాన్ని గత 12 ఏళ్లుగా సమర్థవంతంగా నడిపిస్తున్న నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ అని చంద్రబాబు కొనియాడారు. డిజిటల్ ఇండియా, సౌరశక్తి, గ్రీన్ హైడ్రోజన్, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి రంగాల్లో మోదీ తీసుకున్న చర్యలు దేశ ప్రగతికి దోహదపడ్డాయని అన్నారు.
తీవ్రవాదం, నక్సలిజాన్ని నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను కూడా ప్రశంసించిన సీఎం.. నా రాజకీయ జీవితంలో మోదీ లాంటి నాయకుడిని చూడలేదు. నేషన్ ఫస్ట్ అనే ఆలోచనతో పనిచేసే ప్రధానిని దేశం చూస్తోందని వ్యాఖ్యానించారు. 2047 నాటికి భారత్‌ను ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెట్టే లక్ష్యంతో ప్రధాని మోదీ పనిచేస్తున్నారని, ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తెలిపారు.






















