రౌడీలను, గంజాయి బ్యాచ్‌లను ఉక్కుపాదంతో అణిచివేస్తాం: సీఎం చంద్రబాబు వార్నింగ్

ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో డబుల్ ఇంజన్ స్పీడుతో ముందుకు సాగుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో రౌడీయిజం, గంజాయి బ్యాచ్‌లను పూర్తిగా అణిచివేస్తామని హెచ్చరించారు.

10 ఆగస్టు, 2026 3:27 PM•ByNarender Kumar Nangunoori

Share this article

రౌడీలను, గంజాయి బ్యాచ్‌లను ఉక్కుపాదంతో అణిచివేస్తాం: సీఎం చంద్రబాబు వార్నింగ్

Janavaani Image

ఏలూరు, ఆగస్టు 10(జనవాణి): ఏపీలో డబుల్ ఇంజన్ స్పీడుతో అభివృద్ధి కొనసాగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజు(సోమవారం) కలిదిండిలో పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. అనంతరం నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. ప్రజల్లో కనిపిస్తున్న ఉత్సాహాన్ని చూస్తుంటే ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎన్డీయేదే విజయమని అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉండటంతో అభివృద్ధి వేగంగా జరుగుతోందని తెలిపారు.

పట్టాదార్ పాస్ పుస్తకాలపై కీలక వ్యాఖ్యలు

పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ గౌరవప్రదమైన కార్యక్రమమని చంద్రబాబు అన్నారు. ఇది ప్రతి రైతు, భూ యజమాని ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన పట్టాదార్ పాస్ పుస్తకాలలో ఎవరి ఫొటో వేసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో భూములు ఇవ్వలేదనే కారణంతో పలువురి భూములను 22ఏ జాబితాలో పెట్టి ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. తమ ప్రభుత్వం అలాంటి సమస్యలను పరిష్కరిస్తోందని తెలిపారు. సమస్యలు పరిష్కారం చేస్తే, ప్రజలు జేజేలు కొడతారని పేర్కొన్నారు. ఏం చేయకపోతే 151 సీట్ల పార్టీ ఏమైందో ప్రజలు చూశారని సీఎం చంద్రబాబు అన్నారు. తాను కూడా బటన్ నొక్కవచ్చని, పరదాల చాటున రావచ్చని, విమానంలో తిరిగి వెళ్లిపోవచ్చని కానీ జగన్ లాగా తాను చేయనని తెలిపారు. ఇలా చేస్తే ప్రజల సమస్యలు పరిష్కారమవుతాయా అని ప్రశ్నించారు.

బ్లాక్‌చెయిన్ టెక్నాలజీతో పాస్ పుస్తకాలు

రాష్ట్రంలో ఇప్పటివరకు 7,700 గ్రామాల్లో 32 లక్షల 32 వేల పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేసినట్లు చంద్రబాబు వెల్లడించారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని ఉపయోగించి పాస్ పుస్తకాలను రూపొందించామని, వాటిలోని వివరాలను ఎవరూ మార్చలేరని తెలిపారు. మొత్తం 9,365 గ్రామాల్లో 68 లక్షల 64 వేల పాస్ పుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉందని చెప్పారు. రాబోయే ఏడు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.

రౌడీలు, గంజాయి బ్యాచ్‌లపై కఠిన హెచ్చరిక

రాష్ట్రంలో రౌడీయిజాన్ని పూర్తిగా అరికట్టామని చంద్రబాబు అన్నారు. గతంలో గంజాయి బ్యాచ్‌లు, బ్లేడ్ బ్యాచ్‌లు, రౌడీయిజం చెలాయించే పరిస్థితులు ఉండేవని ఆరోపించారు. రౌడీలను, గంజాయి బ్యాచ్‌లను అణిచివేస్తాం అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రాయలసీమలో గతంలో రాజకీయ ముఠా కక్షలు ఉండేవని, వాటిని నిర్మూలించాలని నిర్ణయించుకుని అమలు చేశామని తెలిపారు

కైకలూరు తాగునీటి సమస్యకు రూ.36 కోట్లు

కృష్ణా జిల్లా ప్రాంతంలో చేపల చెరువులు అధికంగా ఉన్నప్పటికీ తాగునీటి సమస్య ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. కైకలూరులో తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.36 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రజలకు గుంతలు లేని రహదారులపై సాఫీగా ప్రయాణించే పరిస్థితి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే రాష్ట్రం ఎదుర్కొన్న అనేక గడ్డు పరిస్థితులను అధిగమిస్తూ ముందుకు సాగుతున్నామని చెప్పారు.

ఆక్వా రంగానికి అండగా ప్రభుత్వం

ప్రపంచవ్యాప్తంగా ఆహార అలవాట్లు మారుతున్నాయని, భవిష్యత్తు ఆక్వా రంగానిదేనని చంద్రబాబు అన్నారు. ఆక్వా రంగాన్ని ప్రోత్సహించేందుకు యూనిట్ విద్యుత్‌ను రూపాయిన్నరకే అందించినట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో జోన్, నాన్-ఆక్వా జోన్ పేరుతో ఆక్వా రైతులను ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. ప్రస్తుతం ఆక్వా రంగానికి ఎదురవుతున్న సమస్యలను కేంద్ర ప్రభుత్వంతో చర్చించి పరిష్కరిస్తున్నామని చెప్పారు. గతంలో ఒక దౌర్భాగ్య పార్టీ ఉందని.. అదే గొడ్డలి పార్టీ అని విమర్శించారు. తన 48 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో సమస్యలు చూశామని ప్రస్తావించారు. అప్పట్లో నక్సలైట్ల సమస్య ఉండేదని చెప్పారు. తాను వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్తుంటే, 23 క్లామోర్‌మైన్స్ పెట్టి చంపాలని చూశారని అన్నారు. తాను భయపడలేదని.. తాను ప్రజలకు చేసిన మంచి తనను కాపాడుతుందని భావించానని అన్నారు.

అభివృద్ధి పనులపై వైసీపీపై విమర్శలు

భోగాపురం విమానాశ్రయం, పోలవరం, అమరావతి వంటి ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత వాటిని తామే చేశామని వైసీపీ చెప్పుకునే అవకాశం ఉందని చంద్రబాబు విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో డీఎస్సీ ఉద్యోగాల విషయంలో అనేక పిటిషన్లు వేశారని ఆరోపించారు. కష్టపడి చదివిన వారికి ఉద్యోగాలు ఇస్తే.. సంవత్సరం తర్వాత వైసీపీ వారు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారని ఆగ్రహించారు. వైసీపీకి వ్యతిరేకంగా కర్నూలులో ఆందోళన చేశారని.. అయినా వారికి సిగ్గుండాలని విమర్శించారు. ఈ రోజు మళ్ళీ ఆందోళన చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఒకప్పుడు కరెంటు లేని పరిస్థితి నుంచి ఈ రోజు సోలార్ పవర్ తయారు చేసుకునే పరిస్థితికి వచ్చామని తెలిపారు. ఏపీని స్వర్ణాంధ్రగా మార్చే క్రమంలో అడ్డు వచ్చేవారికి సహాయ నిరాకరణ చేయాలని అన్నారు. కష్టపడి చదివిన వారికి ఉద్యోగాలు ఇస్తే.. సంవత్సరం తర్వాత వైసీపీ వారు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారని ఆగ్రహించారు. వైసీపీకి వ్యతిరేకంగా కర్నూలులో ఆందోళన చేశారని.. అయినా వారికి సిగ్గుండాలని విమర్శించారు. ఈ రోజు మళ్ళీ ఆందోళన చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి

ఈ ఏడాది 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆ రోజున ఏపీని స్వర్ణాంధ్రగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ ఒక సంకల్పం తీసుకోవాలని సూచించారు. కొల్లేరు సమస్యపై అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలిస్తున్నామని, దీనికి శాశ్వత పరిష్కారం చూపేందుకు కృషి చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు