తణుకు, సెప్టెంబర్ 5 (జనవాణి): పశ్చిమగోదావరి జిల్లా చించినాడ సమీపంలో విషాద ఘటన చోటుచేసుకుంది. తణుకుకు చెందిన ఓ కుటుంబం చించినాడ వంతెనపై నుంచి గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించారు. నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న పద్మిని అనే మహిళను మత్స్యకారులు రక్షించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. తణుకుకు చెందిన పాల వ్యాపారి నంబూరి శ్రీనివాస్ (45), ఆయన భార్య పద్మిని (42), ఇద్దరు పిల్లలు వెంకటేశ్వర్, నిత్యశ్రీ కలిసి ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. శ్రీనివాస్, ఆయన కుమారుడు, కుమార్తె గోదావరి ప్రవాహంలో కొట్టుకుపోయి గల్లంతయ్యారు.
ముగ్గురి కోసం గాలింపు
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లు, స్థానిక మత్స్యకారులు, బోట్ల సాయంతో గోదావరిలో గల్లంతైన ముగ్గురి కోసం గాలిస్తున్నారు. నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో గాలింపు చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది.
చికిత్స పొందుతున్న పద్మిని
మత్స్యకారులు రక్షించిన పద్మిని తీవ్ర షాక్‌కు గురైంది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె కోలుకున్న తర్వాత ఇచ్చే వాంగ్మూలంతో ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
ఆర్థిక ఇబ్బందులే కారణమా?
కుటుంబం ఈ తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి ఆర్థిక ఇబ్బందులే కారణమా? లేక కుటుంబ కలహాలు మరేదైనా కారణమా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో ఏఈ నూకరాజు కుటుంబం గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువకముందే ఈ ఘటన చోటుచేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతవడంతో చించినాడ, తణుకు ప్రాంతాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.




















