ఆకాశంలో భారత్ సత్తా.. ఈఓఎస్‌-05 ప్రయోగం విజయవంతం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మరో కీలక విజయాన్ని నమోదు చేసింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌17 ద్వారా 2,367 కిలోల ఈఓఎస్‌-05 (జీశాట్‌-1ఏ) ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. రక్షణ, విపత్తు నిర్వహణతో పాటు వ్యవసాయం, అటవీ, నీటి వనరుల పర్యవేక్షణలో ఈ ఉపగ్రహం కీలకంగా మారనుంది.

4 సెప్టెంబర్, 2026 2:37 PM•ByNarender Kumar Nangunoori

Share this article

ఆకాశంలో భారత్ సత్తా.. ఈఓఎస్‌-05 ప్రయోగం విజయవంతం

శ్రీహరికోట,సెప్టెంబర్ 04 (జనవాణి): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మరో ప్రతిష్టాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. రక్షణ, విపత్తు నిర్వహణ రంగాల్లో అత్యంత కీలకమైన ఈఓఎస్‌-05 (జీశాట్‌-1ఏ) ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) రెండో ప్రయోగ వేదిక నుంచి శుక్రవారం తెల్లవారుజామున 2:55 గంటలకు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌17 నింగిలోకి దూసుకెళ్లింది. ప్రయోగం జరిగిన 18 నిమిషాల్లోనే.. అంటే 3:13 గంటలకు 2,367 కిలోల బరువున్న ఈఓఎస్‌-05 ఉపగ్రహాన్ని సబ్‌-జియో సింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌లోకి అత్యంత కచ్చితత్వంతో ప్రవేశపెట్టింది. 51.7 మీటర్ల ఎత్తు, 420.5 టన్నుల బరువున్న ఈ రాకెట్‌తో చేపట్టిన ప్రయోగం జీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో 19వది.

ఒకే ఫ్రేమ్‌లో దక్షిణాసియా..

ఈఓఎస్‌-05 ఉపగ్రహం ప్రత్యేకత దాని అత్యాధునిక ఇమేజింగ్ సామర్థ్యం. భూస్థిర కక్ష్యలో ఉంటూనే మొత్తం దక్షిణాసియాను ఒకే ఫ్రేమ్‌లో చిత్రీకరించగలదు. అంతేకాదు.. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి భారత ఉపఖండానికి సంబంధించిన చిత్రాలను అందించగల సామర్థ్యం దీనికి ఉంది. సాధారణంగా లో ఎర్త్ ఆర్బిట్, సన్ సింక్రోనస్ ఆర్బిట్‌లోని ఉపగ్రహాలు ఒక ప్రాంతాన్ని తిరిగి చిత్రీకరించడానికి రోజులు లేదా వారాలు తీసుకుంటాయి. అయితే ఈఓఎస్‌-05 మాత్రం నిమిషాల వ్యవధిలోనే కీలకమైన చిత్రాలను అందించగలదు. ఇందులోని ఎంఎక్స్‌-వీఎన్‌ఆర్‌ పేలోడ్ ఒక్కో పిక్సెల్‌కు 42 మీటర్ల స్పేషియల్ రిజల్యూషన్‌ను అందిస్తుంది. భూస్థిర కక్ష్యలో ఇంతటి రిజల్యూషన్‌తో కూడిన కెమెరాను కలిగి ఉన్న తొలి ఉపగ్రహంగా ఈఓఎస్‌-05ను ఇస్రో పేర్కొంది.

రక్షణ, విపత్తు నిర్వహణకు కీలకం

ఈఓఎస్‌-05 దేశ భద్రతతో పాటు విపత్తుల నిర్వహణలో కీలక పాత్ర పోషించనుంది. వరదలు, తుపాన్లు, కార్చిచ్చులు వంటి ప్రకృతి విపత్తుల తీవ్రతను వేగంగా అంచనా వేయడంలో ఈ ఉపగ్రహం నుంచి అందే సమాచారం ఉపయోగపడుతుంది. అలాగే సరిహద్దు ప్రాంతాల పర్యవేక్షణ, వ్యవసాయ పంటల ఆరోగ్యం, అటవీ ప్రాంతాలు, నీటి వనరులు, ఖనిజ సంపద వంటి అంశాలను పరిశీలించడంలోనూ దీని హైపర్ స్పెక్ట్రల్, మల్టీ స్పెక్ట్రల్ కెమెరాలు ఉపయోగపడనున్నాయి.

వైఫల్యం నుంచి విజయానికి..

ఈ విజయానికి మరో ప్రత్యేకత ఉంది. గతంలో జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌10 ప్రయోగంలో ఎదురైన వైఫల్యం కారణంగా జీశాట్‌-1 ఉపగ్రహం నిర్దేశిత కక్ష్యను చేరుకోలేకపోయింది. అయితే ఇస్రో శాస్త్రవేత్తలు వెనక్కి తగ్గకుండా సాంకేతికతను మరింత మెరుగుపరిచి ఈసారి విజయాన్ని అందుకున్నారు.

ప్రయోగం జరుగుతున్న సమయంలో శ్రీహరికోటలో కుండపోత వర్షం కురిసినా లాంచ్‌ వ్యూ గ్యాలరీకి దాదాపు 1,500 మంది వరకు తరలివచ్చారు. వర్షంలో తడుస్తూనే ప్రయోగాన్ని వీక్షించిన సందర్శకులు.. రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లడంతో చప్పట్లతో ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు