శ్రీసత్యసాయి జిల్లా, ఆగస్టు 1: బస్సు దొరకలేదనే కారణంతో ఏకంగా ఆర్టీసీ బస్సునే దొంగిలించిన విచిత్ర ఘటన శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం అనంతపురానికి చెందిన శివ శుక్రవారం రాత్రి రైలులో కదిరికి చేరుకున్నాడు. తన పెంపుడు కుక్కను వెంట తీసుకువచ్చిన అతడు అక్కడి నుంచి మదనపల్లె వెళ్లాలని ప్రయత్నించాడు. అయితే అర్ధరాత్రి కావడంతో బస్సులు అందుబాటులో లేకపోవడంతో షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. కదిరి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని బాలికల పాఠశాల వద్ద పార్క్ చేసి ఉన్న ఆర్టీసీ బస్సును స్టార్ట్ చేసి, తన పెంపుడు కుక్కతో కలిసి మదనపల్లె వైపు బయలుదేరాడు. శనివారం తెల్లవారుజామున సుమారు నాలుగు గంటల సమయంలో తట్టివారిపల్లి బైపాస్ వద్ద బస్సును ఆపిన అతడిని గమనించిన బీట్ పోలీసులు అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో కదిరిలోని ఆర్టీసీ బస్సును తానే తీసుకొచ్చినట్లు శివ అంగీకరించినట్లు సమాచారం. దీంతో మదనపల్లె పోలీసులు ఈ విషయాన్ని కదిరి ఆర్టీసీ డిపో అధికారులకు తెలియజేశారు. అనంతరం శివపై కేసు నమోదు చేసి, బస్సును తిరిగి డిపోకు తరలించారు.
మార్గమధ్యంలో నిర్లక్ష్యంగా నడపడంతో బస్సు ఒక వైపు స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. విచారణలో శివ పొంతనలేని సమాధానాలు ఇస్తున్నాడని పోలీసులు వెల్లడించారు. మద్యం మత్తులోనే ఈ పని చేశాడా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనతో ఆర్టీసీ డిపోల్లో నిలిపి ఉంచే బస్సుల భద్రతపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.




















