ప్రపంచ స్థాయి అంతరిక్ష ప్రాజెక్టు ‘మిషన్ శక్తిశాట్’కు తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరానికి చెందిన విద్యార్థిని కందుల జెస్సీ ఎంపికయ్యారు. సోమవారం మిషన్ శక్తిశాట్ డైరెక్టర్ డా. శ్రీమతి కేశన్‌తో కలిసి ఆమె ఉండవల్లిలోని ఏపీ మంత్రి నారా లోకేష్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ధవళేశ్వరం జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న జెస్సీ, ‘మిషన్ శక్తిశాట్’లో ఎంపికై అరుదైన ఘనత సాధించారు. భారత్ నుంచి ఎంపికైన 20 మంది బాలికల్లో చోటు దక్కించుకున్న ఏకైక ఆంధ్రప్రదేశ్ విద్యార్థినిగా ఆమె నిలిచారు.
ఏడో తరగతి నుంచే అంతరిక్షంపై ఆసక్తి
ఈ సందర్భంగా జెస్సీ మాట్లాడుతూ, పాఠశాలలో ఏర్పాటు చేసిన అటల్ టింకరింగ్ ల్యాబ్‌లో చేసిన ప్రయోగాలే తనలో అంతరిక్ష విజ్ఞానంపై ఆసక్తిని పెంచాయని చెప్పారు. ఏడో తరగతి నుంచే స్పేస్ సైన్స్‌పై ప్రత్యేక ఆసక్తి పెరిగిందని, ‘మిషన్ శక్తిశాట్’లో భాగంగా 550 సెషన్లు, 21 మాడ్యూళ్ల శిక్షణ పూర్తి చేసినట్లు వివరించారు.
భవిష్యత్తులో ఏరోనాటికల్ ఇంజనీర్‌గా ఎదగడమే తన లక్ష్యమని, భారత్ నుంచి ఎంపికైన 20 మంది విద్యార్థినుల్లో ఒకరిగా నిలవడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె పేర్కొన్నారు.
స్పేస్ రంగంలో అపార అవకాశాలు
మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి చేస్తున్న 22 పారిశ్రామిక క్లస్టర్లలో స్పేస్ సిటీ క్లస్టర్ కూడా ఒకటని చెప్పారు. అంతరిక్ష రంగంలో యువతకు విస్తృత అవకాశాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుని దేశానికి సేవ చేయాలని సూచించారు.
‘మిషన్ శక్తిశాట్’కు ఎంపికై రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిన జెస్సీని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఆమె భవిష్యత్తు విద్యాభ్యాసం, కెరీర్‌కు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
మిషన్ పోస్టర్ ఆవిష్కరణ
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ ‘మిషన్ శక్తిశాట్’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మిషన్ శక్తిశాట్ డైరెక్టర్, స్పేస్ కిడ్స్ ఇండియా సీఈవో డా. శ్రీమతి కేశన్, సంస్కార ఫౌండేషన్ అధ్యక్షురాలు డా. జ్యోత్స్న తిరునగరి, పాఠశాల ఉపాధ్యాయురాలు కే. మణిమాల పాల్గొన్నారు.




















