అనంతపురం, ఆగస్టు 9 (జనవాణి): అనంతపురం జిల్లా పామిడి మండలం పొగురూరు సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పొగురూరు బ్రిడ్జిపై వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సును ఐషర్ వాహనం ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు రెండు వాహనాలు అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి కిందపడిపోయాయి.
20 మందికి గాయాలు
ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 20 మందికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. వాహనాల్లో చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీసి చికిత్స కోసం పామిడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని అనంతపురం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.
బ్రిడ్జిపై నుంచి కిందకు..
పొగురూరు బ్రిడ్జిపై ప్రయాణిస్తున్న సమయంలో ట్రావెల్స్ బస్సును ఐషర్ వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఢీకొన్న వేగానికి రెండు వాహనాలు బ్రిడ్జి పైనుంచి కిందకు పడిపోయాయి. ప్రమాదం జరిగిన ప్రాంతంలో పరిస్థితి భీతావహంగా మారింది. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రహదారిపై వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించడంతో పాటు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, గాయపడిన వారి పరిస్థితిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.




















