యువత ప్రభుత్వాన్ని ప్రశ్నించండి.. విధ్వంసం చేయకూడదు: పవన్ కల్యాణ్

కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసు దళాల గౌరవ వందనం స్వీకరించారు. సంక్షేమంతో ప్రజలకు భరోసా కల్పిస్తూ, అభివృద్ధితో రాష్ట్ర భవిష్యత్‌కు బాటలు వేస్తున్నామని ఆయన తెలిపారు.

15 ఆగస్టు, 2026 4:13 PM•ByNarender Kumar Nangunoori

Share this article

యువత ప్రభుత్వాన్ని ప్రశ్నించండి.. విధ్వంసం చేయకూడదు: పవన్ కల్యాణ్

కాకినాడ, ఆగస్టు 15 (జనవాణి): కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసు దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పవన్ కల్యాణ్ సతీమణి అన్నా కొణిదెల కూడా వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్న పవన్ కల్యాణ్.. దేశ నిర్మాణంలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. ఎనిమిది దశాబ్దాల భారత ప్రయాణంలో ఒక తరం స్వాతంత్య్రం కోసం పోరాడిందని, మరో తరం దాన్ని కాపాడిందని, ఇంకో తరం దేశ నిర్మాణానికి పునాదులు వేసిందని చెప్పారు. ఇప్పుడు భారత్ స్వయంసమృద్ధి, సమర్థతతో ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా అడుగులు వేస్తోందన్నారు. ఈ ఏడాది వందేమాతరం జాతీయ గేయానికి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తిని మరోసారి గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. స్వాతంత్య్రం సాధించడం వెనుక ఉన్న త్యాగాలను స్మరించుకోవడంతో పాటు, దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను గుర్తించాలని సూచించారు.

స్వాతంత్య్ర పోరాటంతో కాకినాడకు ప్రత్యేక అనుబంధం ఉందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. 1923లో కాకినాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశం జాతీయ స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రలో కీలక ఘట్టమని తెలిపారు. గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించేందుకు ‘అడవితల్లి బాట’ కార్యక్రమం కింద రూ.2,078 కోట్లతో 2,310 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం చేపట్టామని చెప్పారు. ఇప్పటికే 905 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం పూర్తయిందన్నారు. అలాగే ‘అమరజీవి జలధార’ పథకం కింద గతంలో అసంపూర్తిగా ఉన్న పులివెందుల, డోన్, ఉద్దానం తాగునీటి ప్రాజెక్టులను దాదాపు పూర్తి చేశామని తెలిపారు. రూ.8,000 కోట్లతో 1.30 కోట్ల మందికి తాగునీరు అందించేందుకు చిత్తూరు, ప్రకాశం, పల్నాడు, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో మెగా వాటర్ గ్రిడ్ పనులను వేగవంతం చేస్తున్నామని చెప్పారు.

ప్రజాస్వామ్యంలో అభిప్రాయాలను వ్యక్తం చేసే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉందని, అయితే ఆ స్వేచ్ఛను ఇతరులను దూషించడానికి లేదా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి ఉపయోగించకూడదని పవన్ కల్యాణ్ అన్నారు. యువత అన్యాయంపై ప్రశ్నించే ధైర్యంతో పాటు మార్పు తీసుకురావాలనే తపన కలిగి ఉండాలని సూచించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, విధానాలను విమర్శించడం, నిరసన వ్యక్తం చేయడం ప్రజాస్వామ్యంలో భాగమేనని చెప్పారు. అయితే సమస్యలను పరిష్కరించేందుకు నిర్మాణాత్మకంగా పోరాడాలని, వ్యవస్థలో లోపాలు ఉంటే దాన్ని ధ్వంసం చేయకుండా సరిచేయడమే లక్ష్యంగా ఉండాలని సూచించారు.

సీఎం చంద్రబాబు నాయకత్వంలో అమరావతి రాజధాని అభివృద్ధి కొనసాగుతోందని పవన్ కల్యాణ్ తెలిపారు. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని, పోలవరం ప్రాజెక్టు శరవేగంగా పూర్తవుతోందని చెప్పారు. అడవుల సంరక్షణలో దేశంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో రెండో స్థానంలో నిలిచిందని, తీరప్రాంత రక్షణ కోసం గ్రేట్ గ్రీన్ వాల్ వంటి కార్యక్రమాలను చేపడుతున్నామని పేర్కొన్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు