పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట రైతులకు ఊరట.. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో సాగునీటి విడుదల

ఏలేరు ఆయకట్టు పరిధిలోని రైతులకు ఖరీఫ్ సీజన్‌లో సాగునీటి కొరత లేకుండా చర్యలు చేపట్టాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఆయన సూచనల మేరకు పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట నియోజకవర్గాల్లోని సుమారు 53 వేల ఎకరాల ఆయకట్టుకు 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశారు.

28 జులై, 2026 10:18 PM•ByLaharika

Share this article

పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట రైతులకు ఊరట..  పవన్ కళ్యాణ్ ఆదేశాలతో  సాగునీటి విడుదల

ఏలేరు కాలువ కింద సాగు చేస్తున్న రైతులకు ఈ ఖరీఫ్ సీజన్‌లో సాగునీరు సమృద్ధిగా అందించేందుకు ప్రభుత్వం కార్యాచరణ వేగవంతం చేసింది. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ అధ్యక్షతన ప్రత్యేక సాగునీటి సలహా సంఘం సమావేశం నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

ఈ సమావేశంలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, శాసన మండలి విప్ పిడుగు హరిప్రసాద్, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, నీటిపారుదల శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. ఖరీఫ్ సాగునీటి విడుదల, నీటి నిర్వహణ, ఆయకట్టు పరిరక్షణపై సమగ్రంగా చర్చించారు.

53 వేల ఎకరాలకు సాగునీరు

ఏలేరు ప్రాజెక్టులో నీటి లభ్యతను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ 1000 క్యూసెక్కుల సాగునీటిని విడుదల చేసేందుకు ప్రత్యేక క్యాలెండర్ రూపొందించారు. ఈ నిర్ణయంతో పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట నియోజకవర్గాల్లోని సుమారు 53 వేల ఎకరాల ఆయకట్టు రైతులకు ప్రయోజనం చేకూరనుంది.

పిఠాపురం బ్రాంచ్ కెనాల్‌కు ప్రాధాన్యం

పిఠాపురం బ్రాంచ్ కెనాల్ పరిధిలోని 13 వేలకుపైగా ఎకరాలకు నిరంతరాయంగా సాగునీరు అందించాలని సమావేశంలో నిర్ణయించారు. ఆయకట్టు చివరి భూముల వరకు నీరు చేరేలా రూ.2 కోట్లకు పైగా వ్యయంతో కాలువల్లో యుద్ధప్రాతిపదికన పూడికతీత పనులు చేపట్టేందుకు ఆమోదం తెలిపారు.

రైతుల కోసం హెల్ప్‌లైన్

సాగునీటి సమస్యలపై రైతులకు వెంటనే స్పందించేందుకు కాకినాడ కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం 24 గంటలూ అందుబాటులో ఉండే ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్ (9849903879)ను అందుబాటులో ఉంచారు.

ఎల్‌నినో నేపథ్యంలో సూచనలు

సూపర్ ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నీటి వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. సాధ్యమైన చోట ఆరు తడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు.

నీటిపారుదల, వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు స్థానిక నాయకత్వంతో కలిసి రైతులకు నీటి లభ్యత, సాగు విధానాలు, ఎల్‌నినో ప్రభావంపై నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

పంట బీమాపై అవగాహన

ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద రైతులంతా తప్పనిసరిగా పంట బీమా చేయించుకునేలా చర్యలు తీసుకోవాలని సమావేశంలో సూచించారు. పంట బీమా ప్రాధాన్యంపై రైతుల్లో అవగాహన పెంచాలని అధికారులను ఆదేశించారు.

ఏలేరు ఆయకట్టు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని, అందుకు అనుగుణంగా రూపొందించిన కార్యాచరణను సమర్థవంతంగా అమలు చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు స్పష్టం చేసినట్లు సమావేశంలో వెల్లడించారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు