'థాంక్యూ కేరళం'.. ఆయుర్వేద చికిత్స అనంతరం పవన్ కల్యాణ్ భావోద్వేగ పోస్ట్

ఆయుర్వేద చికిత్స కోసం కేరళలో కొన్ని వారాలు గడిపిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చికిత్సను విజయవంతంగా ముగించుకుని రాష్ట్రానికి వీడ్కోలు పలికారు. కేరళ ప్రజల ఆతిథ్యం, వైద్యుల సేవలు, ఆలయాల ఆధ్యాత్మిక అనుభూతిని గుర్తుచేసుకుంటూ ఆయన భావోద్వేగ సందేశం ఇచ్చారు. పవన్ సందేశానికి కేరళ సీఎం ఆత్మీయంగా స్పందిస్తూ సంపూర్ణ ఆరోగ్యం కలగాలని ఆకాంక్షించారు.

13 సెప్టెంబర్, 2026 5:47 PM•ByNarender Kumar Nangunoori

Share this article

'థాంక్యూ కేరళం'.. ఆయుర్వేద చికిత్స అనంతరం పవన్ కల్యాణ్ భావోద్వేగ పోస్ట్

కేరళ, సెప్టెంబర్ 13 (జనవాణి): ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ కేరళలో తన ఆయుర్వేద చికిత్సను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. గత కొన్ని వారాలుగా కేరళలో బస చేసిన ఆయన.. చికిత్సతో పాటు అక్కడి ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించారు. తాజాగా కేరళ ప్రజలు చూపించిన ప్రేమాభిమానాలు, వైద్యుల సేవలు, ఆధ్యాత్మిక అనుభూతులను గుర్తుచేసుకుంటూ భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు.

త్రిస్సూర్‌లోని డాక్టర్ సీతారామ్ ఆయుర్వేదిక్ రిట్రీట్ వైద్యులు, సిబ్బంది అందించిన సేవలను పవన్ కల్యాణ్ ప్రశంసించారు. చికిత్స సమయంలో తనకు లభించిన మానసిక ప్రశాంతత ఎంతో విలువైనదని పేర్కొన్నారు. అలాగే త్రిప్రయార్ శ్రీరామస్వామి, గురువాయూర్ శ్రీకృష్ణుడు, మమ్మియూర్ శ్రీ మహాదేవుడు, చెట్టికులంగర శ్రీ భగవతి అమ్మవారి ఆలయాలను దర్శించుకున్నట్లు తెలిపారు. శతాబ్దాల నాటి సంప్రదాయాలు, ఆలయాల్లోని దైవిక వాతావరణం తనకు ఆధ్యాత్మిక ప్రశాంతతను అందించాయని అన్నారు. భారతీయ ప్రాచీన సంస్కృతికి కేరళ ఆలయాలు సజీవ సాక్ష్యాలని కొనియాడారు.

తన పర్యటన సజావుగా సాగేందుకు సహకరించిన కేరళ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కార్యాలయానికి పవన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన భద్రత, ప్రోటోకాల్ ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించిన కేరళ డీజీపీ, పోలీసు విభాగాలతో పాటు త్రిస్సూర్, అలప్పుళ, కొచ్చి జిల్లాల అధికారులను అభినందించారు. “కేరళ ప్రజల ప్రేమ, ఆతిథ్యం, ఆధ్యాత్మిక జ్ఞాపకాలను గుండెల్లో పదిలంగా దాచుకుంటూ కృతజ్ఞతలతో వీడ్కోలు పలుకుతున్నాను.. థాంక్యూ కేరళం” అంటూ పవన్ కల్యాణ్ తన సందేశాన్ని ముగించారు.

పవన్ సందేశానికి సీఎం స్పందన

పవన్ కల్యాణ్ సందేశంపై కేరళ ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ స్పందించారు. విశ్రాంతి, చికిత్స కోసం కేరళను ఎంచుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. కేరళ ప్రజల ప్రేమ, ప్రాచీన ఆలయాల దర్శనం పవన్‌కు శాంతి, స్వస్థతను అందించడం సంతోషంగా ఉందన్నారు. పవన్ కల్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని కేరళ ప్రభుత్వం, ప్రజల తరఫున ఆకాంక్షించారు. భవిష్యత్‌లో మరోసారి పవన్‌ను కేరళకు ఆహ్వానించాలని ఎదురుచూస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు