శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

శ్రీశైలంలోని వడ్డెర అన్నదాన సత్రంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. మూడు రోజులుగా గది నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో పాటు దుర్వాసన రావడంతో నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపులు తెరిచి చూడగా ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు మృతిచెందినట్లు గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులే కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

25 ఆగస్టు, 2026 1:12 PM•ByNarender Kumar Nangunoori

Share this article

శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

శ్రీశైలం, ఆగస్టు 25 (జనవాణి): శ్రీశైలంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. వడ్డెర అన్నదాన సత్రంలోని ఓ గదిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందిన ఘటన కలకలం రేపింది. మూడు రోజులుగా గది నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో పాటు దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన సత్రం నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గది తలుపులు తెరిచి పరిశీలించారు. బాత్రూమ్‌లో ముగ్గురు మహిళలు, ఫ్యాన్‌కు ఇద్దరు పురుషులు ఉరివేసుకున్న స్థితిలో కనిపించారు. మృతులను సుధాకర్ (36), గోగుల ఆదిలక్ష్మి (50), మల్లేశ్వరి (45), శ్రీదేవి (33), మణికంఠ (15)గా గుర్తించారు. మృతులు సత్యసాయి జిల్లా బత్తలపల్లి గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే పూర్తి వివరాలు దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.

నెల రోజులుగా సత్రంలోనే..

సుధాకర్ కుటుంబ సభ్యులు గత నెల 28న శ్రీశైలం వడ్డెర సత్రంలోని 11వ నంబర్ గదిని రూ.800 చెల్లించి అద్దెకు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రెండు రోజుల తర్వాత గది ఖాళీ చేయాలని నిర్వాహకులు సూచించినప్పటికీ.. అనారోగ్యంతో శ్రీశైలానికి వచ్చామని, మరికొన్ని రోజులు ఉండి పూజలు చేయించుకుంటామని సుధాకర్ చెప్పినట్లు సమాచారం. ఆ తర్వాత రోజుకు రూ.800 చొప్పున చెల్లిస్తూ కుటుంబ సభ్యులు అక్కడే ఉంటున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే యాత్రికులకు నిబంధనలకు విరుద్ధంగా నెల రోజుల పాటు గదిని అద్దెకు ఎందుకు ఇచ్చారనే అంశంపైనా పోలీసులు విచారణ చేస్తున్నారు.

Vaddera annadana satram, srishailam

అధికారుల పరిశీలన

ఘటనపై ఆలయ ఈవో శ్రీనివాసరావు, శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ రమేష్ నాయుడు, ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోలీసులు కిందకు దించి పోస్టుమార్టం నిమిత్తం సున్నిపెంట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కుటుంబం నెల రోజుల పాటు శ్రీశైలంలో ఎందుకు ఉన్నారు? వారి ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి? సత్రం నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా గదిని ఇంతకాలం ఎందుకు కేటాయించారు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు