సోషల్ మీడియా యాప్ ద్వారా పరిచయం పెంచుకుని ఒడిశాకు చెందిన ఇద్దరు కార్మికులను బెదిరించి రూ.90 వేలకు పైగా నగదు బదిలీ చేయించుకున్న ముగ్గురు నిందితులను గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి నగదు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకోగా, నేరానికి ఉపయోగించిన మోటార్‌సైకిల్‌ను సీజ్ చేశారు.
గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోషల్ మీడియా యాప్ ద్వారా పరిచయం ఏర్పరుచుకుని కార్మికులను బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో విజయవాడకు చెందిన మహంకాళి కిషోర్ (24), పచ్చిగోళ్ళ మోషే (24), పల్లేటి క్రాంతికుమార్ (22)లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల కథనం ప్రకారం, ఒడిశా రాష్ట్రం బాలేశ్వర్ జిల్లాకు చెందిన ఉదయ్ బెహరా ప్రస్తుతం యర్రబాలెం గ్రామంలో నివసిస్తూ ఓ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. అతనికి సోషల్ మీడియా యాప్ ద్వారా మహంకాళి కిషోర్‌తో పరిచయం ఏర్పడింది. అనంతరం వాట్సాప్ వీడియో కాల్స్ ద్వారా స్నేహం పెంచుకున్న నిందితుడు బాధితుడి నివాస వివరాలు తెలుసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
జూలై 26 అర్ధరాత్రి ఇద్దరు సహచరులతో కలిసి బాధితుల గదికి వెళ్లిన నిందితులు మొదట మద్యం కోసం రూ.3 వేల తీసుకున్నారని, అనంతరం మరింత డబ్బు ఇవ్వాలని బెదిరించి, ప్రాణహాని కలిగిస్తామని భయపెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో ఒక బాధితుడి నుంచి ఫోన్‌పే ద్వారా రూ.90 వేలు, మరో బాధితుడి నుంచి రూ.800 బదిలీ చేయించుకుని, ఒక మొబైల్ ఫోన్‌ను తీసుకుని పరారైనట్లు పేర్కొన్నారు.
అయితే పరారయ్యే సమయంలో వారు ఉపయోగించిన మోటార్‌సైకిల్ స్టార్ట్ కాకపోవడంతో దానిని అక్కడే వదిలి వెళ్లినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
సాంకేతిక ఆధారాలతో నిందితుల గుర్తింపు
ఫిర్యాదు అందుకున్న మంగళగిరి రూరల్ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, డిజిటల్ లావాదేవీలు, ఇతర సాంకేతిక ఆధారాలను విశ్లేషించి నిందితులను గుర్తించారు. జూలై 28న యర్రబాలెంలోని డాన్ బోస్కో పాఠశాల సమీపంలో వారిని అదుపులోకి తీసుకుని రూ.90 వేల నగదు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఇన్‌స్పెక్టర్ చిరుమామిళ్ల వెంకట్, ఎస్‌ఐ నవీన్ నాయక్, హెడ్ కానిస్టేబుళ్లు శ్యామ్, చలమ్ పాల్గొన్నారు.
యువతకు పోలీసుల సూచనలు
సోషల్ మీడియా, డేటింగ్ యాప్‌లు లేదా ఇతర ఆన్‌లైన్ వేదికల ద్వారా అపరిచితులతో వ్యక్తిగత పరిచయాలు పెంచుకోవడంలో అప్రమత్తంగా ఉండాలని మంగళగిరి రూరల్ పోలీసులు సూచించారు. వ్యక్తిగత వివరాలు, నివాస చిరునామా, బ్యాంకు లేదా యూపీఐ సమాచారాన్ని అపరిచితులతో పంచుకోవద్దని హెచ్చరించారు. ఆన్‌లైన్ పరిచయమైన వారిని ఒంటరిగా కలవకూడదని, ఎవరైనా బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.




















