ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఇటీవల కురిసిన వర్షాల తర్వాత పసుపు రంగు కప్పలు కనిపించి స్థానికులను ఆశ్చర్యానికి గురిచేశాయి. ఈ కప్పల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వాటిపై ఆసక్తి పెరిగింది. ఇవి అరుదైన జాతి కప్పలు కాదని, సంభోగ కాలంలో ఆడ కప్పలను ఆకర్షించేందుకు మగ కప్పలు పసుపుగా మార్చుకుంటాయని వెటర్నరీ అధికారులు తెలిపారు.
సాధారణంగా ఖాకీ లేదా ఆలివ్ గ్రీన్ రంగులో కనిపించే ఈ కప్పలు వర్షాకాలంలో సంభోగ కాలం ప్రారంభమైనప్పుడు ప్రకాశవంతమైన పసుపు రంగులోకి మారుతాయి. ముఖ్యంగా మగ కప్పలు మాత్రమే ఇలా రంగు మార్చుకుంటాయని, ఆడ కప్పలను ఆకర్షించేందుకు ప్రకృతి వాటికి ఈ ప్రత్యేక లక్షణాన్ని ఇచ్చిందని అధికారులు వివరించారు.
ఈ కప్పలు సాధారణంగా చెరువులు, గుంటలు, తడి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కనిపిస్తాయి. సంభోగ సమయంలో వీటి గొంతు భాగంలోని స్వరపేటికలు నీలం రంగులోకి మారడమే కాకుండా ప్రత్యేకమైన శబ్దాలను కూడా చేస్తాయి. ఈ శబ్దాల ద్వారానే ఆడ కప్పలను ఆకర్షిస్తాయి.
వర్షాకాలం ముగిసి సంభోగ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ కప్పలు మళ్లీ తమ సహజమైన ఆకుపచ్చ లేదా ఆలివ్ రంగులోకి మారిపోతాయని అధికారులు తెలిపారు. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో విస్తారంగా కనిపించే ఇండియన్ బుల్ ఫ్రాగ్స్ ప్రస్తుతం తగ్గుతున్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు. చెరువులు కనుమరుగవడం, తడి ప్రాంతాలు తగ్గిపోవడం, పర్యావరణ కాలుష్యం పెరగడం వంటి కారణాలతో వీటి నివాసాలు క్రమంగా తగ్గిపోతున్నాయని పేర్కొంటున్నారు.




















