ప్రజా సమస్యలపై మరింత గట్టిగా పోరాడండి.. పార్టీ నేతలకు వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం

అసెంబ్లీ, మండలి వర్షాకాల సమావేశాల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్‌ జగన్‌ సమావేశమయ్యారు. డీఎస్సీ అక్రమాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, రైతులు, పీపీపీ విధానం తదితర అంశాలపై గట్టిగా పోరాడాలని సూచించారు.

12 ఆగస్టు, 2026 7:46 PM•ByRalin

Share this article

ప్రజా సమస్యలపై మరింత గట్టిగా పోరాడండి.. పార్టీ నేతలకు వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం

వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో నిర్వహించిన సమావేశంలో వైఎస్ జగన్

తాడేపల్లి, ఆగస్టు 12 (జనవాణి): ప్రజా సమస్యలపై శాసనసభ, శాసనమండలిలో మరింత గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీయాలని వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ప్రజా ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ, మండలి వర్షాకాల సమావేశాల నేపథ్యంలో తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన సమావేశమయ్యారు. సభలో అనుసరించాల్సిన వ్యూహం, లేవనెత్తాల్సిన ప్రజా సమస్యలపై చర్చించారు.

శాసనసభలో వైఎస్సార్‌సీపీ గొంతు వినిపించకుండా చేయాలనే ఉద్దేశంతోనే తమ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని జగన్‌ ఆరోపించారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే సభలో మాట్లాడేందుకు ఎక్కువ సమయం, హక్కులు కల్పించాల్సి వస్తుందని.. అందుకే ప్రభుత్వం ఆ హోదాను ఇవ్వడం లేదని విమర్శించారు. అసెంబ్లీలో తమకు అవకాశం పరిమితంగా ఉన్నప్పటికీ.. ప్రెస్‌మీట్లు, ఇతర వేదికల ద్వారా ఆధారాలతో ప్రజలకు ప్రభుత్వ వాదనలోని మరో కోణాన్ని వివరిస్తామని చెప్పారు.

శాసనమండలిలో వైఎస్సార్‌సీపీకి మంచి సంఖ్యాబలం ఉన్నందున ప్రజా సమస్యలపై అక్కడ మరింత బలంగా పోరాడాలని ఎమ్మెల్సీలకు సూచించారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా ప్రతి అంశంపై ప్రభుత్వం నుంచి సమాధానం రాబట్టేలా సిద్ధం కావాలని కోరారు.

డీఎస్సీ–2025లో పేపర్‌ లీకేజీ, అక్రమాలపై రాజీలేని పోరాటం కొనసాగించాలని జగన్‌ స్పష్టం చేశారు. ఈ అంశంపై 74 రోజులుగా దాదాపు పది రకాల ఆందోళన కార్యక్రమాలు నిర్వహించామని, అక్రమాలకు సంబంధించిన ఆధారాలను ఇప్పటికే ప్రజల ముందుంచామని తెలిపారు. డీఎస్సీ వ్యవహారంపై నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాలని, సీబీఐతో సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేశారు.

డీఎస్సీ నియామకాల్లో మెరిట్‌ జాబితాల మార్పులు, రెండు జీవోలు, స్పోర్ట్స్‌ కోటా పేరుతో జరిగిన నియామకాలు, ఉద్యోగాల కోసం డబ్బులు అడిగినట్లు ప్రచారంలోకి వచ్చిన ఆడియో, వీడియో కాల్స్‌ వంటి అంశాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరగాలని జగన్‌ కోరారు. సోషల్‌ మీడియాలో వచ్చిన ఆరోపణల్లో ఉద్యోగం కోసం రూ.14.5 లక్షల వరకు ఆన్‌లైన్‌ బదిలీలు జరిగినట్లు బాధితులు చెబుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి అంశాలపై స్వతంత్ర దర్యాప్తు ద్వారానే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అన్నారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌, వసతి దీవెన బకాయిలపైనా ప్రభుత్వం నుంచి సమాధానం రాబట్టాలని పార్టీ ఎమ్మెల్సీలకు జగన్‌ సూచించారు. 13 త్రైమాసికాలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు ఉన్నాయని, ఒక్కో త్రైమాసికానికి సుమారు రూ.700 కోట్ల చొప్పున రూ.9,100 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. వసతి దీవెన కింద మరో రూ.3,300 కోట్లు బకాయిలు ఉన్నాయని, రెండూ కలిపి సుమారు రూ.12,400 కోట్లు చెల్లించాల్సి ఉండగా ప్రభుత్వం రూ.2,900 కోట్లు మాత్రమే చెల్లించిందని ఆరోపించారు. విద్యార్థుల తరఫున మండలిలో గట్టిగా పోరాడాలని సూచించారు.

రైతుల సమస్యలను కూడా సభలో ప్రధానంగా లేవనెత్తాలని జగన్‌ అన్నారు. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర రావడం లేదని, ఉచిత పంటల బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ వంటి మద్దతు లేక రైతులు సంక్షోభంలో ఉన్నారని విమర్శించారు. పంటలు వేసిన తర్వాత నీటి సమస్యలు ఎదురవుతున్నాయని, రైతులకు ప్రభుత్వం అండగా నిలవడం లేదని ఆరోపించారు.

కొత్త పీపీపీ విధానం రాష్ట్రానికి నష్టదాయకంగా మారుతుందని జగన్‌ విమర్శించారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌ ఫర్‌ సేల్‌’’ అన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. పీపీపీ ప్రాజెక్టులకు ప్రభుత్వం వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ ఇవ్వడంతో పాటు ప్రైవేట్‌ సంస్థలు తీసుకునే రుణాలకు వడ్డీ కూడా ప్రభుత్వమే చెల్లించే విధానం తీసుకురావడం సరికాదన్నారు. తాగునీరు, పాఠశాలలు, ఆస్పత్రులు, రవాణా వంటి ప్రజా సేవలను కూడా పీపీపీ పరిధిలోకి తీసుకురావడాన్ని ఆయన ప్రశ్నించారు.

దిశ వ్యవస్థ రద్దు, మహిళల భద్రత, బీసీ నాయకులపై కేసుల అంశాలను కూడా మండలిలో లేవనెత్తాలని జగన్‌ సూచించారు. శాంతియుతంగా నిరసనలు తెలిపే వారిపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీకి చెందిన బీసీ నాయకులను లక్ష్యంగా చేసుకుని కక్షపూరితంగా కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు. ఈ అంశాలపై న్యాయపోరాటం కూడా చేస్తామని తెలిపారు.

ప్రభుత్వం విడుదల చేస్తున్న శ్వేతపత్రాలపై కూడా జగన్‌ విమర్శలు చేశారు. అవి శ్వేతపత్రాలు కాదని, ‘‘పచ్చ పత్రాలు.. పచ్చి అబద్ధాల పత్రాలు’’ అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం విడుదల చేసిన నివేదికల్లోని అంశాలను ఆధారాలు, సాక్ష్యాలతో ప్రజల ముందుంచాలని పార్టీ నేతలకు సూచించారు. తాము మాట్లాడే ప్రతి అంశానికి పక్కా ఆధారాలు, మూలాలు ఉండాలని.. ఏ నివేదిక నుంచి సమాచారం తీసుకున్నారో, దానిలో ఏ పేజీలో ఉందో కూడా ప్రజలకు చూపించాలని సూచించారు.

విజన్‌–2020 పేరుతో గతంలో చంద్రబాబు చేసిన ప్రచారం, ప్రస్తుతం విజన్‌–2047 పేరుతో చేస్తున్న కార్యక్రమాలపైనా జగన్‌ విమర్శలు చేశారు. గతంలో ప్రకటించిన విజన్‌–2020లో ఎన్ని లక్ష్యాలు సాధించారో ప్రభుత్వం చెప్పాలని ప్రశ్నించారు. కేవలం ప్రచారం చేసుకోవడం కాకుండా గత హామీలు, ప్రస్తుత విధానాలపై వాస్తవాలను ప్రజల ముందుంచాలని పార్టీ నేతలకు సూచించారు.

జూనియర్‌ డాక్టర్ల స్టైఫండ్‌ పెంపు డిమాండ్‌, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు, మహిళల సంక్షేమం, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడం, మహిళలకు అందుతున్న రుణాల్లో తగ్గుదల, ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన జీవో నంబర్‌ 3 అమలు, ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రయత్నాలు వంటి అంశాలపై కూడా మండలిలో ప్రభుత్వాన్ని నిలదీయాలని జగన్‌ సూచించారు.

ప్రతి అంశంపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పూర్తిస్థాయిలో సన్నద్ధమై సభకు రావాలని జగన్‌ అన్నారు. ప్రిపరేషన్‌ లేకుండా మాట్లాడవద్దని, సబ్జెక్టుల వారీగా సమాచారం సేకరించి ఆధారాలు, సాక్ష్యాలతోనే ప్రజల ముందుకు వెళ్లాలని సూచించారు. కంటెంట్‌, ఆధారాలు, సరైన సమాచారం ఉంటేనే ప్రజలకు విషయాన్ని బలంగా వివరించగలమని పార్టీ ప్రజా ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు.

Ralin

Written By

Ralin

Reporter

Ralin is an experienced journalist with over 12 years of experience in journalism and digital media. Ralin has worked with leading Telugu media organizations, including Eenadu, Andhra Jyothi, and Namasthe Telangana, and specializes in news writing, digital journalism, SEO content, editing, and feature writing.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు