తెలంగాణ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఒకే యాప్‌లో ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్ సేవలు

తెలంగాణ ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రజా రవాణా సేవలను ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకురావాలనే లక్ష్యంతో మీసేవ ఆధ్వర్యంలో ‘మీటికెట్ (MeeTicket)’ యాప్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇందులో ఆర్టీసీ, మెట్రోతో పాటు ఆటోలు, క్యాబ్‌లను కూడా అనుసంధానించనున్నారు. దీంతో ప్రయాణికులు ఒకే యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవడంతో పాటు, గమ్యస్థానానికి వెళ్లేందుకు ఆటో లేదా క్యాబ్‌ను ముందుగానే బుక్ చేసుకోవచ్చు.

18 ఆగస్టు, 2026 5:53 PM•ByNarender Kumar Nangunoori

Share this article

తెలంగాణ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఒకే యాప్‌లో ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్ సేవలు

హైదరాబాద్, ఆగస్టు 18 (జనవాణి): తెలంగాణలో ప్రజా రవాణా వ్యవస్థ మరింత ఆధునికం కానుంది. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని టీజీఎస్‌ఆర్టీసీ (TGSRTC).. మీసేవ ఆధ్వర్యంలో మీటికెట్ (Mee Ticket) యాప్‌ను అభివృద్ధి చేస్తోంది. ప్రయాణ రంగానికి సంబంధించిన వివిధ సేవలను ఒకే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకురావడమే ఈ యాప్ ప్రధాన ఉద్దేశం.

ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్‌లు ఒకే వేదికపై

‘మీటికెట్’ యాప్‌లో ఆర్టీసీ, మెట్రోతో పాటు ఆటోలు, క్యాబ్ సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి. ప్రయాణికులు ఒకే యాప్‌లో ఆర్టీసీ లేదా మెట్రో టికెట్ బుక్ చేసుకోవచ్చు. అనంతరం తమ గమ్యస్థానానికి చేరుకునేందుకు అవసరమైన ఆటో లేదా క్యాబ్‌ను కూడా ముందుగానే బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.

చెల్లింపులు కూడా సులభమే

ప్రయాణికులు చెల్లించిన మొత్తాన్ని సంబంధిత రవాణా సంస్థలు, భాగస్వాములకు ఆటోమేటిక్‌గా జమ చేసే ఆధునిక చెల్లింపు వ్యవస్థను యాప్‌లో ఏర్పాటు చేయనున్నారు. దీంతో ప్రయాణికులకు సమయం ఆదా కావడంతో పాటు, వివిధ రవాణా సేవలను సమన్వయంతో వినియోగించుకునే అవకాశం లభిస్తుంది.

డ్రైవర్లకు కూడా ప్రయోజనం

‘మీటికెట్’ను ఉమ్మడి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌గా రూపొందిస్తున్నారు. ఆటో, క్యాబ్ డ్రైవర్లతో పాటు ఇతర రవాణా సేవలందించే వారు ఇందులో భాగస్వాములుగా చేరి ప్రయాణికులకు నేరుగా సేవలు అందించవచ్చు. దీంతో ప్రయాణికులకు సులభమైన ప్రయాణం, రవాణా భాగస్వాములకు అదనపు అవకాశాలు లభించనున్నాయి.

ఆర్టీసీ ఆటోలు నడుపుతుందన్న ప్రచారంపై స్పష్టత

ఆర్టీసీ సొంతంగా ఆటోలు కొనుగోలు చేసి నడుపుతుందంటూ ఇటీవల సోషల్ మీడియాలో, కొన్ని వేదికల్లో జరుగుతున్న ప్రచారాన్ని టీజీఎస్‌ఆర్టీసీ ఖండించింది. ఆర్టీసీ స్వయంగా ఆటోలను కొనుగోలు చేయడం లేదా నిర్వహించడం చేయదని స్పష్టం చేసింది. భవిష్యత్తులోనూ అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని తెలిపింది. ప్రయాణికులు, ఆటో డ్రైవర్లు ఈ ప్రచారాన్ని నమ్మి అపోహలకు గురికావద్దని ఆర్టీసీ యాజమాన్యం సూచించింది. ‘మీటికెట్’లో ఆటో, క్యాబ్ సేవలను భాగస్వామ్య విధానంలో అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని స్పష్టం చేసింది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు