Alcohol | ఆహార పదార్థాల్లో కల్తీ గురించి తరచూ వింటుంటాం. కానీ, మద్యంలోనూ కల్తీ జరుగుతోందన్న షాకింగ్ మారింది. పేరున్న మద్యం తయారీ సంస్థలు సైతం అసలు మద్యం తయారీ ప్రక్రియను పక్కనపెట్టి.. కృత్రిమ ఫ్లేవర్లతో ఆల్కహాల్‌ను సిద్ధం చేసి విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. ఇటీవల ముంబై హైకోర్టు ఇచ్చిన ఆదేశం ఈ అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది. దేశవ్యాప్తంగా ప్రముఖ మద్యం తయారీ సంస్థలకు చెందిన వివిధ రకాల మద్యం నమూనాలను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) పరీక్షించింది. ఈ పరీక్షల్లో చాలా నమూనాల్లో కృత్రిమ ఫ్లేవర్లు కల్తీ పదార్థాలుగా ఉపయోగించినట్లు గుర్తించినట్లు తేలింది. సాధారణంగా మద్యం తయారీలో కిణ్వ ప్రక్రియ, డిస్టిలేషన్, దీర్ఘకాల నిల్వ వంటి సంక్లిష్ట ప్రక్రియలు ఉంటాయి. అయితే, కొందరు తయారీదారులు న్యూట్రల్ ఆల్కహాల్, ఎక్స్‌ట్రా న్యూట్రల్ ఆల్కహాల్‌ను ప్రధానంగా ఉపయోగించి.. తర్వాత కృత్రిమ ఫ్లేవర్లను జోడించి ప్రత్యేకమైన రుచి, వాసనను తీసుకొస్తున్నట్లు పరీక్షల్లో తేలింది. ఇలా చేయడం వల్ల సుదీర్ఘ తయారీ ప్రక్రియ, నిల్వ సమయం, ఉత్పత్తిలో ఎదురయ్యే ఇబ్బందులు తగ్గుతాయి. తక్కువ సమయంలో ఉత్పత్తిని మార్కెట్‌లోకి తీసుకురావడంతో పాటు ఉత్పత్తి వ్యయం తగ్గి లాభాలు పెరుగుతాయి.
నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..
మద్యంలో ఫ్లేవర్లను కలపడం పూర్తిగా నిషేధం కాదు. వాటి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (ఆల్కహాలిక్ బెవరేజెస్) రెగ్యులేషన్స్-2018 పరిధిలోనే ఉండాలి. ఇలాంటి పద్ధతుల్లో తయారైన పానీయాలను వాటి అసలు పేర్లతో కాకుండా.. తగిన ఫ్లేవర్డ్ పేర్లతో విక్రయించాల్సి ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తే అది శిక్షార్హమైన నేరం. పరీక్షల్లో మరో కీలక అంశం కూడా బయటపడింది. కొన్ని మద్యం బాటిళ్లపై ఉన్న లేబుళ్లలో మద్యం వయసుకు సంబంధించి తప్పుదోవ పట్టించే వివరాలు ఉన్నట్లు విశ్లేషణలో తేలింది. బ్లెండ్‌లో ఉపయోగించిన అత్యంత తక్కువ వయసున్న స్పిరిట్ వయసుతోనూ లేబుల్‌పై పేర్కొన్న వయసు సరిపోలలేదని గుర్తించారు. కొద్దిపాటి పాత స్పిరిట్‌ను కొత్త స్పిరిట్‌తో కలిపి.. మొత్తం మిశ్రమాన్ని ఏజ్డ్ మద్యం పేరుతో విక్రయించిన సందర్భాలూ ఉన్నట్లు వెల్లడైంది. దీంతో వినియోగదారుడు అధిక ధర చెల్లించే పరిస్థితి ఏర్పడుతోంది.
ఓక్ వుడ్ పేరుతోనూ..
మద్యం తయారీలో బార్లీ వంటి ధాన్యాలు, పండ్లను ఉపయోగిస్తున్నట్లు కంపెనీలు చెబుతుంటాయి. అలాగే. ఓక్ వుడ్‌లో మద్యం తయారు చేస్తామన్న ప్రచారమూ ఉంటుంది. అయితే, ఓక్ ప్రధానంగా మద్యానికి ప్రత్యేకమైన రుచి, వాసన అందించేందుకు ఉపయోగిస్తారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం మద్యం పరిపక్వత పొందిందిగా పరిగణించాలంటే తగిన చెక్క పాత్ర.. బారెల్‌లో, లేదంటే ఓక్ చిప్స్‌తో కనీసం ఏడాది పాటు ఏజింగ్ చేయాల్సి ఉంటుంది. మద్యం రుచి, రంగు, టెక్స్చర్‌ను మార్చేందుకు గ్లిజరిన్, క్యారమెల్ కలర్, ఓక్ పౌడర్, ఎక్స్‌ట్రాక్ట్, చక్కెర వంటి పదార్థాలను కూడా ఉపయోగిస్తున్నట్లు విశ్లేషణలో వెల్లడైంది. ఇవి మద్యం ఎక్కువ కాలం బారెల్‌లో నిల్వ చేసినట్లుగా కనిపించేలా చేయడంతో పాటు డిస్టిలేషన్ ద్వారా వచ్చే లక్షణాలను అనుకరించేందుకు ఉపయోగపడతాయి. గ్లిజరిన్ మద్యం నోటికి స్మూత్‌గా అనిపించేలా చేసి.. ఆల్కహాల్ ఘాటును తగ్గిస్తుంది. క్యారమెల్ కలర్ కలపడం వల్ల మద్యం ముదురు రంగులోకి మారి.. ఎక్కువ కాలం బారెల్‌లో ఏజింగ్ చేసినట్లుగా కనిపిస్తుంది.
లేబుల్ చూస్తున్నారా?
మద్యం వల్ల కలిగే దుష్ప్రభావాలకు తోడు.. ఇలాంటి అక్రమ కల్తీ వాటిని మరింత పెంచే అవకాశం ఉంది. అయితే, మద్యం కొనుగోలు చేసే సమయంలో చాలామంది బాటిల్‌పై ఉన్న లేబుల్‌ను పెద్దగా పట్టించుకోరు. దీంతో అందులో ఉపయోగించిన అసలు పదార్థాలపై వినియోగదారులకు స్పష్టత ఉండటం లేదు. నిబంధనల ప్రకారం మద్యం బాటిళ్లపై ఉపయోగించిన పదార్థాలు, వాటికి సంబంధించిన సమాచారం, షెల్ఫ్ లైఫ్, నిల్వ ఉష్ణోగ్రత వంటి వివరాలు ఉండాలి. కానీ ఆచరణలో వీటిని చాలా సందర్భాల్లో పాటించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అందుకే మద్యం కొనుగోలు చేసే ముందు బాటిల్‌పై ఉన్న లేబుల్‌ను జాగ్రత్తగా పరిశీలించడం అవసరం. ఉత్పత్తి స్వచ్ఛతపై అవగాహన లేకపోతే జేబుకే కాదు.. ఆరోగ్యానికీ నష్టం జరిగే అవకాశం ఉంది.




















