పాలు లేకుండానే కోవా స్వీట్లు తయారు.. కరీంనగర్‌లో షాకింగ్

పాలు లేకుండానే మైదాతో కలాకంద్, మైసూర్ పాక్ తయారు చేస్తున్న ఓ స్వీటు షాపు బండారం బయటపడింది. ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో సుమారు 40 కిలోల కల్తీ స్వీట్లను ధ్వంసం చేసి, 1,300 కిలోల ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

11 సెప్టెంబర్, 2026 3:29 PM•ByNarender Kumar Nangunoori

Share this article

పాలు లేకుండానే కోవా స్వీట్లు తయారు.. కరీంనగర్‌లో షాకింగ్

కరీంనగర్‌, సెప్టెంబర్ 11 (జనవాణి): పాలు ఉపయోగించాల్సిన స్వీట్లను అసలు పాలు లేకుండానే తయారు చేస్తున్న ఓ స్వీట్‌ తయారీ కేంద్రం బండారం బయటపడింది. అంతేకాకుండా లైసెన్స్‌ లేకుండా హోటల్‌ నిర్వహించడం, అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలను తయారు చేయడం, నిబంధనలకు విరుద్ధంగా కృత్రిమ రంగులు వినియోగించడం వంటి ఉల్లంఘనలు కూడా వెలుగుచూశాయి. కరీంనగర్‌లో పలు స్వీట్‌ హౌజ్‌లు, రెస్టారెంట్లు, హోటళ్లపై గురువారం ఫుడ్‌ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించి చర్యలు చేపట్టారు.

కొత్తపల్లి మండలం బావుపేటలోని శ్రీ బాలాజీ మ్యాజిక్‌ మిఠాయి తయారీ కేంద్రంలో తనిఖీలు నిర్వహించగా.. పాలు లేకుండానే అజ్మేరి కలాకంద్‌ను మైదాతో తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే పాలు ఉపయోగించకుండా మిల్క్‌ మైసూర్‌ పాక్‌ తయారు చేస్తున్నట్లు తేలింది. స్వీట్ల తయారీ ప్రాంగణం కూడా అత్యంత అపరిశుభ్రంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

ఈ కేంద్రంలో తయారయ్యే స్వీట్లు కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లోని పలు స్వీట్‌ షాపులు, బేకరీలకు సరఫరా అవుతున్నట్లు అధికారులు తెలిపారు. తనిఖీల్లో సుమారు 40 కిలోల కల్తీ స్వీట్లను అక్కడికక్కడే ధ్వంసం చేశారు. స్వీట్ల తయారీని అడ్డుకునేందుకు 1,300 కిలోల మైదా, చక్కెర తదితర ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. సంస్థకు సంబంధించిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ను సస్పెండ్‌ చేసి, తయారీ కేంద్రాన్ని సీజ్‌ చేశారు.

అనంతరం కరీంనగర్‌లోని కూచిపూడి రెస్టారెంట్‌లో తనిఖీలు నిర్వహించగా వంటశాల అపరిశుభ్రంగా ఉండటంతో పాటు ఆహార నిర్వాహకులు వ్యక్తిగత పరిశుభ్రత ప్రమాణాలు పాటించకపోవడాన్ని అధికారులు గుర్తించారు. బట్టర్‌ నాన్‌ తయారీలో ఫ్యాట్‌ స్ప్రెడ్‌ వినియోగిస్తున్నట్లు గుర్తించి సంబంధిత వ్యాపారికి ఇంప్రూవ్‌మెంట్‌ నోటీసు జారీ చేశారు.

Hotel

గీతాభవన్‌ చౌరస్తాలోని ఫేమస్‌ హోటల్‌ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్‌ లేకుండానే నిర్వహిస్తున్నట్లు తనిఖీల్లో తేలింది. దీంతో హోటల్‌ను వెంటనే మూసివేయించారు. అవసరమైన లైసెన్స్‌ పొందిన తర్వాతే తిరిగి కార్యకలాపాలు నిర్వహించేందుకు అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు.

అదే ప్రాంతంలోని మతామ్‌ అల్‌ హబీబి అరేబియన్‌ ఫ్యామిలీ రెస్టారెంట్‌లోనూ పలు ఆహార భద్రతా ఉల్లంఘనలు గుర్తించారు. ఆహార తయారీలో కృత్రిమ రంగులు ఉపయోగించవద్దని గతంలోనే హెచ్చరించినప్పటికీ నిబంధనలు పాటించలేదని అధికారులు తెలిపారు. వంటశాలలో బొద్దింకలు సంచరిస్తున్నట్లు గుర్తించడంతోపాటు సుమారు 8 కిలోల హాండీ రైస్‌ను అక్కడికక్కడే ధ్వంసం చేశారు. తీవ్రమైన ఉల్లంఘనలను పరిగణనలోకి తీసుకుని ఆ రెస్టారెంట్‌ లైసెన్స్‌ను రద్దు చేసినట్లు గెజిటెడ్‌ ఫుడ్‌ సేఫ్టీ ఇన్‌స్పెక్టర్‌ రోహిత్‌రెడ్డి తెలిపారు. ఆయా ఆహార పదార్థాల నమూనాలను సేకరించి విశ్లేషణ కోసం రాష్ట్ర ఆహార ప్రయోగశాలకు పంపించినట్లు వెల్లడించారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు