న్యూఢిల్లీ, జూలై 29: ఉద్యోగం మారిన తర్వాత మీ పాత కంపెనీలోని ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ఖాతా ఏమైందో గుర్తులేదా? రెండు, మూడు కంపెనీల్లో పనిచేసి పాత పీఎఫ్ డబ్బు ఎక్కడ ఉందో ఆందోళన చెందుతున్నారా? ఇదే సమస్యతో బాధపడుతున్న లక్షలాది మంది ఉద్యోగులకు ఈపీఎఫ్‌వో ఊరటనిచ్చే సదుపాయాన్ని తీసుకొచ్చింది. పాత లేదా ఇనాక్టివ్ పీఎఫ్ ఖాతాలను గుర్తించి వాటిలోని సొమ్మును ప్రస్తుతం వినియోగిస్తున్న UAN అకౌంట్‌కు ఆన్‌లైన్‌లోనే బదిలీ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే ఈ మేరకు రాతపూర్వక సమాధానమిచ్చారు.
దేశవ్యాప్తంగా ప్రస్తుతం 8 కోట్లకు పైగా ఉద్యోగులు ఉద్యోగ భవిష్యత నిధి సంస్థ (EPFO) పరిధిలో ఉన్నారు. అయితే 2014లో UAN వ్యవస్థ అమల్లోకి రాకముందు ఉద్యోగులు కంపెనీ మారిన ప్రతిసారి కొత్త పీఎఫ్ అకౌంట్ నంబర్ పొందేవారు. ఇలా కంపెనీ మారినప్పుడల్లా కొత్త అకౌంట్ నంబర్లు రావడంతో చాలామంది పాత ఖాతాలు అలాగే మిగిలిపోయాయి. UAN వచ్చిన తర్వాత కంపెనీ సాయంతో కొందరు తమ పాత పీఎఫ్ అకౌంట్లను ఒకే ఖాతా కిందకు బదిలీ చేసుకున్నారు.. కానీ బదిలీ ప్రక్రియ చాలా క్లిష్టంగా చాలామంది అలాగే వదిలేశారు. కొద్దిరోజులకు ఆ అకౌంట్ల గురించి పూర్తిగా మరిచిపోయారు. ఇప్పుడు ఆ పీఎఫ్ ఖాతాల్లో నుంచి డబ్బులు తీయాలంటే వాటి వివరాలు తెలియక ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఈ సమస్యకు పరిష్కారంగా కొత్త డిజిటల్ పోర్టల్‌ను ఈపీఎఫ్‌వో అభివృద్ధి చేసింది.
ఆధార్ ధృవీకరణతోనే సేవలు
ఈ కొత్త పోర్టల్‌లో ఆధార్ ఆధారిత డిజిటల్ అథెంటికేషన్ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగుల తమ పాత లేదా ఇనాక్టివ్ పీఎఫ్ ఖాతాలను గుర్తించవచ్చు. అలా గుర్తించిన ఖాతాల్లోని మొత్తాన్ని ఎలాంటి కంపెనీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, కేవలం ఆన్‌లైన్ ద్వారానే ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న UAN ఖాతాకు బదిలీ చేసుకునే అవకాశం ఉంటుంది. అవసరమైతే పాత ఖాతాల్లోని మొత్తానికి ఆన్‌లైన్‌లోనే సెటిల్‌మెంట్ క్లైయిమ్ కూడా చేసుకోవచ్చు.
కొత్త పోర్టల్‌తో కలిగే ప్రయోజనాలేంటి?
ఈ కొత్త పోర్టల్ ద్వారా ఉద్యోగులు తమ ఇంటి నుంచే సేవలను పొందవచ్చు. పాత లేదా మూసివేసిన పీఎఫ్ ఖాతాలను గుర్తించడం, ఆ ఖాతాల్లోని సొమ్మును యాక్టివ్ UANకు బదిలీ చేయడం, కేవైసీ వివరాల్లో మార్పులకు అవసరమైన జాయింట్ డిక్లరేషన్‌ను ఆన్‌లైన్‌లోనే సబ్మిట్ చేయవచ్చు. ఈ డిజిటల్ ధృవీకరణ వల్ల పాత కంపెనీలు, పీఎఫ్ కార్యాలయాల చుట్టూ తిరిగి మ్యాన్యువల్ వెరిఫికేషన్ చేయాల్సిన పని ఉండదు. కాబట్టి చాలా వేగంగా సేవలు పొందవచ్చు దీనివల్ల మోసాలకు కూడా అడ్డుకట్ట వేయవచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
ఎవరైనా ఈ సదుపాయం ఉపయోగించుకోవచ్చా?
ఈ కొత్త వ్యవస్థ ద్వారా పాత పీఎఫ్ ఖాతా వివరాలు లేదా వాటికి సంబంధించి గుర్తింపు సమాచారం ఉన్న సభ్యులు మాత్రమే ఉపయోగించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పాత మెంబర్ ఐడీ, ఖాతా వివరాలు లేదా ఇతర గుర్తింపు సమాచారం పూర్తిగా కోల్పోయిన వారి కోసం ప్రత్యేక వ్యవస్థను తీసుకొచ్చే ప్రతిపాదన ఏదీ లేదని లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అంటే అందుబాటులో ఉన్న రికార్డుల ఆధారంగానే పాత ఖాతాలను గుర్తించే అవకాశం ఉంటుంది.
ఉద్యోగులకు భారీ ఊరట
ఉద్యోగాలు మారిన ప్రతిసారి పీఎఫ్ ఖాతాలు పెరగడం వల్ల రిటైర్‌మెంట్ పొదుపులు వేరవేరు ఖాతాల్లో నిలిచిపోయే పరిస్థితి ఉంది. కానీ కొత్త ఈ - పోర్టల్‌తో ఆ సమస్యకు పరిష్కారం లభించనుంది. పాత ఖాతాల్లోని నిధులను ఒకే UAN కింద సమీకరించుకోవడం వల్ల భవిష్యత్తులో పీఎఫ్ క్లైయిమ్‌లు, ట్రాన్స్‌ఫర్, అకౌంట్ మెయింటెనెన్స్ మరింత సులభతరం కానుంది. ఆన్‌లైన్ సేవల కారణంగా పీఎఫ్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకపోవడంతో ఉద్యోగుల సమయం కూడా ఆదా అవుతుంది.




















