అవన్నీ రాష్ట్రాలే చూసుకోవాలి.. రేషన్ షాపులపై కీలక ప్రకటన చేసిన కేంద్రం

దేశవ్యాప్తంగా రేషన్ షాపుల (ఫెయిర్ ప్రైస్ షాపులు) నిర్వహణ, డీలర్ల కమిషన్ పెంపు అంశాలపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రేషన్ దుకాణాల నిర్వహణ, డీలర్లకు చెల్లించే మార్జిన్ (కమిషన్), లైసెన్సుల జారీ వంటి అంశాలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనే ఉంటాయని స్పష్టం చేసింది.

30 జులై, 2026 1:22 PM•ByRamchandram

Share this article

అవన్నీ రాష్ట్రాలే చూసుకోవాలి.. రేషన్ షాపులపై కీలక ప్రకటన చేసిన కేంద్రం

ఫైల్ ఫొటో

న్యూఢిల్లీ, జూలై 30: దేశవ్యాప్తంగా రేషన్ షాపుల (ఫెయిర్ ప్రైస్ షాపులు) నిర్వహణ, డీలర్ల కమిషన్ పెంపు అంశాలపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రేషన్ దుకాణాల నిర్వహణ, డీలర్లకు చెల్లించే మార్జిన్ (కమిషన్), లైసెన్సుల జారీ వంటి అంశాలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనే ఉంటాయని స్పష్టం చేసింది. లోక్‌సభలో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అడిగిన ప్రశ్నకు వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి నిముబెన్ జయంతీభాయ్ బంభానియా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) కింద లక్ష్యిత ప్రజా పంపిణీ వ్యవస్థ (టీపీడీఎస్) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త బాధ్యత అని కేంద్రం తెలిపింది. అయితే రేషన్ కార్డుల జారీ, లబ్ధిదారుల గుర్తింపు, రేషన్ దుకాణాల లైసెన్సులు, డీలర్ల పర్యవేక్షణ, కమిషన్ నిర్ణయం వంటి అన్ని కార్యాచరణ బాధ్యతలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలవేనని పేర్కొంది.

టీపీడీఎస్ (కంట్రోల్) ఆర్డర్–2015 ప్రకారం రేషన్ దుకాణాల నిర్వహణ ఆర్థికంగా లాభదాయకంగా ఉండేలా డీలర్ల మార్జిన్‌ను రాష్ట్ర ప్రభుత్వాలు కాలానుగుణంగా సమీక్షించాలని సూచించినట్లు కేంద్రం వెల్లడించింది. అవసరమైతే రేషన్ దుకాణాల్లో ఇతర వస్తువుల విక్రయానికీ రాష్ట్రాలు అనుమతి ఇవ్వవచ్చని తెలిపింది. రేషన్ డీలర్లకు కేంద్రం అందించే ఆర్థిక సహాయాన్ని ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పెంచినట్లు వెల్లడించింది. సాధారణ రాష్ట్రాల్లో క్వింటాల్‌కు రూ.90 నుంచి రూ.100కు, ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాల్లో రూ.180 నుంచి రూ.195కు కేంద్ర సహాయాన్ని పెంచినట్లు పేర్కొంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైతే దీనికంటే అధిక కమిషన్‌ను కూడా నిర్ణయించుకోవచ్చని స్పష్టం చేసింది.

రేషన్ దుకాణాల ఆదాయ వనరులు పెంచేందుకు బ్యాంకింగ్ సేవలు, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సేవలు, చిన్న ఎల్పీజీ సిలిండర్ల విక్రయం, నిత్యావసర వస్తువుల అమ్మకాలు వంటి అదనపు సేవలను ప్రారంభించాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించినట్లు తెలిపింది. అలాగే డీలర్లకు డిజిటల్, ఆర్థిక నిర్వహణ, ఈ-కామర్స్ తదితర అంశాల్లో ప్రత్యేక శిక్షణ కూడా అందిస్తున్నట్లు వెల్లడించింది. అయితే రేషన్ దుకాణాల ద్వారా ప్రధానమంత్రి భారతీయ జనఔషధి కేంద్రాలను (జన్ ఔషధి కేంద్రాలు) ఏర్పాటు చేసే ప్రతిపాదన ప్రస్తుతం లేదని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో స్పష్టం చేసింది.

R

Written By

Ramchandram

Newsroom Staff

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు