హైదరాబాద్,సెప్టెంబర్ 15 (జనవాణి): నానక్‌రామ్‌గూడ భూ వివాదానికి సంబంధించి సినీ నటుడు అల్లు అర్జున్ మామ కే. చంద్రశేఖర్ రెడ్డిపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. చంద్రశేఖర్ రెడ్డితో పాటు మురళీధర్ రెడ్డి, గడ్డం రవి తదితరులపై కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ప్రత్యేక ఆర్థిక మండలి (SEZ) పరిధిలో ఉన్న మంత్రీ కాస్మోస్ భవన ప్రాంగణంలోకి కొందరు వ్యక్తులు అక్రమంగా ప్రవేశించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్కడి గేటు తాళాలు పగులగొట్టి, కొన్ని నిర్మాణాలను ధ్వంసం చేసినట్లు ఆరోపించారు. అంతేకాకుండా అక్కడ విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సిబ్బందిని బెదిరించి, ప్రాంగణంలో టిన్‌షీట్లు ఏర్పాటు చేశారని ఫిర్యాదుదారులు ఆరోపించారు.
ఈ ఘటనపై మంత్రీ కాస్మోస్ ఓనర్స్ అసోసియేషన్ తరఫున పెద్దిరాజు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ప్రతులను డీజీపీ, సైబరాబాద్ పోలీస్ కమిషనర్, మాదాపూర్ డీసీపీ, గచ్చిబౌలి ఏసీపీలకు కూడా అందించినట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ప్రాంగణంలోకి అక్రమంగా ప్రవేశించి బెదిరింపులకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రీ కాస్మోస్ ఓనర్స్ అసోసియేషన్ పోలీసులను కోరింది. ఈ ఫిర్యాదుపై పోలీసులు తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంది.




















