హైదరాబాద్,సెప్టెంబర్ 23 (జనవాణి): నేచురల్ స్టార్ నాని హీరోగా, యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ చిత్రంపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రీమియర్ షోను హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఓ థియేటర్‌లో ప్రేక్షకులతో కలిసి వీక్షించేందుకు అనుమతి ఇవ్వాలని నాని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. సినిమాను ప్రేక్షకుల మధ్య కూర్చొని చూడటం తనకు ప్రత్యేకమైన అనుభూతి అని నాని పేర్కొన్నారు. ప్రీమియర్ సందర్భంగా అమల్లో ఉన్న అన్ని ప్రభుత్వ ప్రోటోకాల్స్, భద్రతా మార్గదర్శకాలను తప్పకుండా పాటిస్తామని, ప్రజల భద్రతకే తమ తొలి ప్రాధాన్యమని స్పష్టం చేశారు.
నాని విజ్ఞప్తిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. భద్రతా మార్గదర్శకాలను గౌరవిస్తున్నందుకు నానిని అభినందించారు. అలాగే తెలంగాణకు చెందిన యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలపై ప్రశంసలు కురిపించారు. ప్రజా భద్రత, జనసమూహ నియంత్రణను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాలని సీఎం సూచించారు. ఇందుకోసం సంబంధిత స్థానిక పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తును పోలీసులు పరిశీలించిన అనంతరం తదుపరి నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు.
ఇక ‘ది ప్యారడైజ్’ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీనికి ఒక రోజు ముందుగా, సెప్టెంబర్ 23న ప్రీమియర్ షోలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో అభిమానులతో కలిసి సినిమా చూడాలన్న నాని కోరికపై ఇప్పుడు పోలీసుల నిర్ణయం కీలకంగా మారింది.
Loading Tweet...




















