Film News: బాలీవుడ్‌లో ప్రస్తుతం ‘హనుమాన్ అంశ్’ పేరు మార్మోగుతోంది. భారీ బడ్జెట్ చిత్రాలకు సాధ్యం కాని రీతిలో ఈ చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లు సాధిస్తోంది. విడుదలైన ఐదో వారాంతంలో ఏకంగా రూ.45.60 కోట్లు రాబట్టి సరికొత్త ఆల్‌టైమ్ రికార్డును నెలకొల్పింది.
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలీ బాబా (Neem Karoli Baba) జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని విశాల్ చతుర్వేది తెరకెక్కించారు. ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు తొలి రెండు వారాల్లో పెద్దగా స్పందన కనిపించలేదు. అయితే మూడో వారం నుంచి పాజిటివ్ మౌత్ టాక్ రావడంతో కలెక్షన్లు ఒక్కసారిగా పుంజుకున్నాయి.
ఈ ప్రభావంతో సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్లింది. కేవలం 31 రోజుల్లోనే రూ.100 కోట్ల మార్క్‌ను దాటింది. తాజాగా సెప్టెంబర్ 4 నుంచి 6 వరకు జరిగిన ఐదో వారాంతంలో రూ.45.60 కోట్ల వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.
ఇప్పటివరకు ఐదో వీకెండ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో ‘ధురంధర్’ పార్ట్ 1 రూ.35.80 కోట్లు, ‘పుష్ప 2’ హిందీ వెర్షన్ రూ.14 కోట్లు సాధించాయి. తాజాగా ‘హనుమాన్ అంశ్’ ఈ రెండు చిత్రాల రికార్డులను అధిగమించి నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది.
చిన్న సినిమాగా ప్రారంభమైన ‘హనుమాన్ అంశ్’ ఈ స్థాయిలో బాక్సాఫీస్ సత్తా చాటడం బాలీవుడ్ వాణిజ్య విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా మౌత్ టాక్‌తో సినిమా వసూళ్లు భారీగా పెరగడం విశేషంగా మారింది. కాగా, ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 11న ఓవర్సీస్ మార్కెట్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్లలో సినిమా ఎలాంటి వసూళ్లు సాధిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.




















