సినిమా 22 నిమిషాలు ఆలస్యం.. థియేటర్‌కు రూ.75 వేల జరిమానా!

సినిమా ప్రారంభానికి ముందు 22 నిమిషాల పాటు వాణిజ్య ప్రకటనలు ప్రసారం చేసి షోను ఆలస్యం చేసిన హైదరాబాద్‌లోని ఓ థియేటర్‌కు వినియోగదారుల కమిషన్ భారీ జరిమానా విధించింది. బాధిత ప్రేక్షకుడికి రూ.25 వేలు చెల్లించడంతో పాటు మరో రూ.50 వేలను జిల్లా వినియోగదారుల సంక్షేమ నిధికి జమ చేయాలని ఆదేశించింది.

29 సెప్టెంబర్, 2026 3:27 PM•ByNarender Kumar Nangunoori

Share this article

సినిమా 22 నిమిషాలు ఆలస్యం.. థియేటర్‌కు రూ.75 వేల జరిమానా!

Social Media Image

హైదరాబాద్, సెప్టెంబర్ 29 (జనవాణి): సినిమా చూసేందుకు థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకులకు షో ఆలస్యం కావడం సాధారణంగా ఎదురయ్యే సమస్య. అయితే వాణిజ్య ప్రకటనల పేరుతో ఏకంగా 22 నిమిషాలు సినిమా ఆలస్యం చేసిన ఓ థియేటర్‌కు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్ భారీ జరిమానా విధించింది.

అసలు ఏం జరిగిందంటే..

2025 జూన్‌లో ఓ యువకుడు తన స్నేహితుడితో కలిసి ‘కుబేర’ సినిమా చూసేందుకు రెండు టికెట్లు బుక్ చేసుకున్నాడు. రాత్రి 10.35 గంటలకు షో ఉండటంతో ఐదు నిమిషాల ముందుగానే అంటే 10.30 గంటలకు థియేటర్‌కు చేరుకుని తమకు కేటాయించిన సీట్లలో కూర్చున్నారు.

అయితే సినిమా ప్రారంభం కావాల్సిన సమయంలో మూవీని ప్రదర్శించకుండా థియేటర్ యాజమాన్యం వరుసగా ప్రకటనలను ప్రసారం చేసింది. దాదాపు 22 నిమిషాల పాటు కమర్షియల్ యాడ్స్ ప్రదర్శించడంతో సినిమా 10.52 గంటలకు ప్రారంభమైంది.

సినిమా పూర్తయ్యే సరికి సమయం బాగా ఆలస్యమైంది. దీంతో ఇంటికి చేరుకునే సమయానికి తెల్లవారుజామున 3 గంటలు కావడంతో తన సమయం వృథా కావడంతో పాటు తీవ్ర అసౌకర్యానికి గురయ్యానంటూ బాధిత యువకుడు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు.

ఫిర్యాదును విచారించిన కమిషన్ థియేటర్ యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా ప్రారంభానికి ముందు ప్రకటనల ప్రదర్శనకు సంబంధించి కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నిబంధనలను కమిషన్ ప్రస్తావించింది. సినిమా ప్రారంభానికి ముందు ప్రకటనలు పరిమిత సమయం మాత్రమే ఉండాలని, అవి కూడా ప్రజా అవగాహనకు సంబంధించినవిగా ఉండాలని పేర్కొంది. అయితే థియేటర్‌లో 22 నిమిషాల పాటు వాణిజ్య ప్రకటనలు ప్రదర్శించడం ద్వారా ప్రేక్షకుడి విలువైన సమయాన్ని వృథా చేసినట్లేనని కమిషన్ అభిప్రాయపడింది.

ఈ నేపథ్యంలో సదరు థియేటర్‌కు మొత్తం రూ.75 వేల జరిమానా విధించింది. ఇందులో రూ.25 వేలను బాధిత యువకుడికి పరిహారంగా చెల్లించాలని, మరో రూ.50 వేలను జిల్లా వినియోగదారుల సంక్షేమ నిధికి జమ చేయాలని థియేటర్ యాజమాన్యాన్ని ఆదేశించింది. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు