మేడారం,సెప్టెంబర్ 29 (జనవాణి): నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ నాలుగు రోజుల్లోనే రూ.155 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ విజయోత్సాహంలో ఉన్న చిత్రబృందం మంగళవారం మేడారంలోని సమ్మక్క-సారలమ్మ ఆలయాన్ని సందర్శించింది.
హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి, నటుడు సంపూర్ణేష్‌బాబుతో పాటు చిత్రబృందం, టెక్నీషియన్లు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవార్లకు నిలువెత్తు బంగారం, పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
మేడారం వెళ్లే ముందు చిత్రబృందం ములుగులోని గట్టమ్మ ఆలయంలోనూ పూజలు చేసింది. ‘ది ప్యారడైజ్’ టీమ్ ఆలయాలను సందర్శించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నాని మేకోవర్‌కు ప్రశంసలు
తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ఒక జాతి గుర్తింపు కోసం సాగించిన పోరాటం నేపథ్యంలో శ్రీకాంత్ ఓదెల ‘ది ప్యారడైజ్’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో జడల్ పాత్రలో నాని పూర్తిగా భిన్నమైన లుక్‌లో కనిపించారు. ఆయన మేకోవర్, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. నాని తొలిసారి పూర్తిస్థాయి యాక్షన్ పాత్రలో నటించిన సినిమాగా ఇది నిలిచింది. కయదు లోహర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ ప్రత్యేక గీతంలో కనిపించారు. మోహన్‌బాబు విలన్‌గా నటించగా, సంపూర్ణేష్‌బాబు, ప్రియదర్శి కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ సంగీతం అందించారు.





















