భారతీయ సినిమా ఇప్పుడు కేవలం స్టార్ హీరోల క్రేజ్‌పైనే ఆధారపడటం లేదు. ప్రేక్షకులకు హాలీవుడ్ స్థాయి విజువల్ ఎక్స్‌పీరియన్స్ అందించాలనే లక్ష్యంతో నిర్మాతలు వందల కోట్ల నుంచి వేల కోట్ల వరకు పెట్టుబడులు పెడుతున్నారు. అత్యాధునిక వీఎఫ్ఎక్స్, భారీ సెట్లు, ప్రపంచస్థాయి టెక్నికల్ క్వాలిటీతో రూపొందుతున్న సినిమా ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమా స్థాయిని మరింత పెంచుతున్నాయి. ప్రస్తుతం భారతీయ సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన, తెరకెక్కుతున్న టాప్-10 సినిమాలపై ఓ లుక్కేద్దాం.
1. రామాయణం – రూ.4,000 కోట్లు (అంచనా):
నితేశ్ తివారీ దర్శకత్వంలో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న 'రామాయణం' భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్‌గా నిలవనుంది. మొత్తం బడ్జెట్ సుమారు రూ.4,000 కోట్లుగా అంచనా వేస్తున్నారు. నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్, యశ్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఏ.ఆర్. రెహమాన్, హాన్స్ జిమ్మర్ సంగీతం అందిస్తుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
2. వారణాసి – రూ.1,300 కోట్లు (అంచనా):
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న 'వారణాసి' భారీ అడ్వెంచర్ యాక్షన్ చిత్రంగా రూపొందుతోంది. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సాగే అడ్వెంచర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు దాదాపు రూ.1,300 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి.
3. రాకా – రూ.1,000 కోట్లు (అంచనా):
అల్లు అర్జున్ హీరోగా, అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న 'రాకా' కూడా ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాల్లో ఒకటి. సైన్స్ ఫిక్షన్, సూపర్ హీరో కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తోంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ బడ్జెట్ సుమారు రూ.1,000 కోట్లుగా ప్రచారం జరుగుతోంది.
4. టాక్సిక్ – రూ.700–800 కోట్లు (అంచనా):
రాకింగ్ స్టార్ యశ్ హీరోగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'టాక్సిక్' పీరియడ్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా. హాలీవుడ్ స్థాయి యాక్షన్, విజువల్స్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు రూ.700 నుంచి రూ.800 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
5. కల్కి 2898 AD – రూ.600 కోట్లు:
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన 'కల్కి 2898 AD' భారతీయ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో కొత్త చరిత్ర సృష్టించింది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని దాదాపు రూ.600 కోట్లతో నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా రూ.1,250 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రానికి ఇప్పుడు 'కల్కి 2' కూడా సిద్ధమవుతోంది.
6. RRR – రూ.550 కోట్లు:
ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన 'RRR' ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమాకు కొత్త గుర్తింపు తీసుకొచ్చింది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం సుమారు రూ.550 కోట్ల బడ్జెట్‌తో రూపొందింది. బాక్సాఫీస్ వద్ద రూ.1,300 కోట్లకు పైగా వసూలు చేయడంతో పాటు 'నాటు నాటు' పాటకు ఆస్కార్ అవార్డు రావడం చరిత్రగా నిలిచింది.
7. ఆదిపురుష్ – రూ.500–700 కోట్లు:
ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందిన 'ఆదిపురుష్' కూడా భారీ బడ్జెట్ చిత్రాల్లో ఒకటి. రూ.500 నుంచి రూ.700 కోట్ల మధ్య వ్యయంతో నిర్మించిన ఈ సినిమా విడుదల తర్వాత విజువల్ ఎఫెక్ట్స్, డైలాగ్స్ కారణంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.
8. 2.0 – రూ.450–600 కోట్లు:
సూపర్ స్టార్ రజనీకాంత్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో శంకర్ తెరకెక్కించిన '2.0' భారతీయ సినిమా సాంకేతిక ప్రమాణాలను మరో స్థాయికి తీసుకెళ్లింది. అత్యాధునిక వీఎఫ్ఎక్స్, రోబోటిక్స్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రానికి రూ.450 నుంచి రూ.600 కోట్ల వరకు ఖర్చు చేశారు. సాంకేతికంగా ప్రశంసలు అందుకున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద అంచనాలకు తగ్గ ఫలితం సాధించలేకపోయింది.
9. సాహో – రూ.350 కోట్లు:
ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సాహో'ను దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. హాలీవుడ్ స్థాయి యాక్షన్ సన్నివేశాలు, విదేశాల్లో చిత్రీకరణ, భారీ విజువల్స్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హిందీ మార్కెట్‌లో మంచి వసూళ్లు సాధించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లు నమోదు చేసింది.
10. బ్రహ్మాస్త్ర పార్ట్ 1: శివ – రూ.410 కోట్లు:
రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన 'బ్రహ్మాస్త్ర పార్ట్ 1: శివ' భారతీయ ఫాంటసీ సినిమాల్లో అత్యంత భారీ ప్రాజెక్ట్‌లలో ఒకటి. దాదాపు రూ.410 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం వీఎఫ్ఎక్స్, విజువల్ ప్రెజెంటేషన్‌కు మంచి ప్రశంసలు అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా మంచి వసూళ్లు సాధించి ఫ్రాంచైజీకి బలమైన పునాది వేసింది.




















