టాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన విలనిజంతో కోట్లాది మంది ప్రేక్షకులను మెప్పించిన ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ (74) కన్నుమూశారు. కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో యావత్ టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. 80కి పైగా సినిమాల్లో నటించిన ప్రదీప్ రావత్ చివరి సారిగా 'గాయపడ్డ సింహం' సినిమాలో కనిపించాడు.
బి.ఆర్. చోప్రా రూపొందించిన ఐకానిక్ సీరియల్ ‘మహాభారత్’ లో అశ్వత్థామ రోల్‌తో ప్రదీప్ రావత్ తన నట జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత బాలీవుడ్‌లో సర్పరోష్, లగాన్ వంటి ప్రతిష్టాత్మక సినిమాల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ స్టార్టింగ్‌లో చిన్న పాత్రలు చేసినప్పటికీ, తన నటనలోని వైవిధ్యంతో దర్శకుల దృష్టిని ఆకర్షించారు.
దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి ‘సై’ (2004) మూవీతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు ప్రదీప్ రావత్. ఈ సినిమాలో ఆయన పోషించిన ‘భిక్షూ యాదవ్’ రోల్ టాలీవుడ్ విలనిజంలో ఒక కొత్త ఒరవడిని సృష్టించింది. విలక్షణమైన బాడీ లాంగ్వేజ్, గంభీరమైన గొంతు, భయంకరమైన నటనతో భిక్షూ యాదవ్ పాత్రను చిరస్మరణీయంగా మలిచాడు. ఈ పాత్రకుగానూ ఆయనకు 'ఉత్తమ విలన్'గా ఫిలింఫేర్‌తో పాటు నంది అవార్డు కూడా వరించింది.
‘సై’ సక్సెస్‌తో ప్రదీప్ రావత్ మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత ఆయన టాలీవుడ్‌లో ఫుల్ డిమాండ్ ఉన్న విలన్‌గా మారారు. రాజమౌళి దర్శకత్వంలోనే వచ్చిన ‘ఛత్రపతి’ సినిమాలో ‘రాస్ బిహారి’గా పవర్ ఫుల్ రోల్ పోషించాడు. ఆ తర్వాత ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ‘గజిని’ తమిళ, హిందీ వెర్షన్లలో మేయిన్ విలన్‌గా నటించి పాన్-ఇండియా స్థాయిలో మెప్పించారు. ఇవేకాకుండా భద్ర, లక్ష్మి, దేశముదురు, యోగి, జగడం, స్టాలిన్, పంచాక్షరి వంటి చాలా సక్సెస్ ఫుల్ సినిమాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు.
ప్రదీప్ రావత్ కేవలం కేకలు వేసే విలన్ పాత్రలకే పరిమితం కాలేదు. కళ్ళతోనే భయాన్ని కలిగిస్తూ గంభీరమైన హావభావాలను ప్రదర్శించేవాడు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళంతో పాటు ఇంగ్లీష్, ఒడియా, బెంగాళి, భోజ్‌పురి, నేపాలి, మరాఠి భాషల్లో కూడా సినిమాలు చేశాడు. తన టెర్రిఫిక్ యాక్టింగ్‌తో భారతీయ చలనచిత్ర రంగాన ఒక పవర్ ఫుల్ యాక్టర్‌గా ముద్ర వేసిన ప్రదీప్ రావత్ గారి మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు.





















