అనగనగా ఒక సంచలనం ఆమెనే సిల్క్ స్మిత. కేవలం పద్దెనిమిదేళ్ల సినీ ప్రయాణంలో నాలుగు వందలకు పైగా సినిమాల్లో నటించి అప్పట్లో రికార్డు సృష్టించింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లోనూ తనదైన శైలిలో నటిస్తూ అగ్ర హీరోలందరి సరసన తెరను పంచుకుంది. కేవలం ఐటెం సాంగ్స్‌కే పరిమితం కాకుండా వైవిధ్యభరితమైన పాత్రలు పోషించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె తెరపై కనిపిస్తే చాలు థియేటర్లలో ఈలలు గోలలతో ప్రేక్షకులు హోరెత్తించేవారు.
అప్పట్లో సిల్క్ స్మిత ఆమె ఉంటేనే సినిమా సక్సెస్ అవుతుందనే నమ్మకం దర్శక నిర్మాతల్లో ఉండేది. ది లెజెండరీ దర్శకుడు దాసరి నారాయణరావు ఆమెపై తీయాల్సిన పాటను వద్దనుకున్నాడట. దాంతో డిస్ట్రిబ్యూటర్లు ఏకంగా ఆ సినిమానే కొనమని చెప్పానంటే ఆమె ప్రభావం ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
ఆమెకున్న క్రేజ్ గురించి చెప్పుకోవడానికి ఈ చిన్న ఉదాహరణ చాలు. షూటింగ్ సమయంలో సిల్క్ స్మిత సగం కొరికి పడేసిన ఆపిల్ ను కొనుగోలు చేయడానికి ఆమె అభిమానులు పోటీ పడ్డారు. ఆ కాలంలో కేవలం ఒక్క రూపాయి, రెండు రూపాయలు ఉన్న ఆపిల్‌ను ఆ అభిమాని ఏకంగా ఇరవై ఐదు వేల రూపాయలు వెచ్చించి మరీ వేలంలో దక్కించుకున్నాడు. అప్పట్లో ఇరవై ఐదు వేల రూపాయలు అంటే మామూలు విషయం కాదు. కేవలం ఆమెపై ఉన్న అమితమైన అభిమానంతో ఆ వ్యక్తి ఆ మొత్తాన్ని చెల్లించి ఆ జ్ఞాపకాన్ని సొంతం చేసుకున్నాడు.
వెండితెరపై కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆ అందాల తార నిజ జీవితంలో మాత్రం ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. చిన్నతనంలో పడిన ఇబ్బందులు ఇండస్ట్రీకి వచ్చాక ఎదురైన ఒడిదుడుకులు ఆమెను మానసికంగా కృంగదీశాయి. అప్పట్లో ఆమె సంపాదించిన సంపాదన భారీగానే ఉన్నా సరైన ప్లానింగ్ లేకపోవడం, చాలా మంది చేతిలో మోసపోవడం వంటి కారణాల వల్ల చివరి దశలో సర్వస్వం కోల్పోయింది. చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా కటిక పేదరికంలోకి జారిపోయింది.
అప్పుల ఊబిలో కూరుకుపోయి దిక్కుతోచని స్థితిలో అనుమానాస్పద రీతిలో కేవలం 36 ఏళ్ళకే ఆమె తనువు చాలించింది. ఆమె మరణం వెనుక అసలు నిజాలు ఏమిటనేది ఇప్పటికీ అంతుచిక్కని రహస్యంగానే మిగిలిపోయింది. సిల్క్ స్మిత కన్న కలలు వేరు ఆమె జీవితం ముగిసిన తీరు వేరు. తెరవెనుక ఆమె పడిన వేదన ఎవరికీ తెలియదు. వెండితెరపై మెరిసిన ఒక గొప్ప ఉల్క అనూహ్యంగా కనుమరుగైపోయింది. నేటి తరానికి ఆమె ఒక జ్ఞాపకం మాత్రమే కావచ్చు కానీ అప్పట్లో ఆమె ఒక మహాశక్తి. ఆమె జీవితం అందించిన పాఠాలు ఎప్పటికీ నిలిచిపోతాయి.




















