చండీగఢ్,సెప్టెంబర్ 26 (జనవాణి): చండీగఢ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. పెళ్లికి అడ్డుపడుతున్నాడని కన్న తండ్రినే 18 ఏళ్ల కుమారుడు తుపాకీతో కాల్చి చంపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నితిన్ సింగ్ చండీగఢ్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు 18 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. కొంతకాలంగా తన ప్రియురాలిని పెళ్లి చేసుకుంటానని కుమారుడు తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నాడు. అయితే చట్ట ప్రకారం పెళ్లి చేసుకోవడానికి 21 ఏళ్లు నిండాలని తల్లిదండ్రులు అతడికి చెప్పారు. సరైన వయసు వచ్చే వరకు వేచి ఉండాలని సూచించారు.
ఈ విషయమై గత గురువారం తండ్రి, కుమారుడి మధ్య వాగ్వాదం జరిగింది. తనకు వెంటనే పెళ్లి చేయాలని యువకుడు పట్టుబట్టాడు. అంతేకాకుండా ప్రియురాలిని ఇంటికి తీసుకువస్తానని, అందుకు డబ్బులు ఇవ్వాలని తండ్రిని డిమాండ్ చేశాడు. అందుకు నితిన్ సింగ్ నిరాకరించడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కుమారుడు తుపాకీతో తండ్రిపై కాల్పులు జరిపాడు.
మరుసటి రోజు నితిన్ సింగ్ మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు ఆయన తలలో బుల్లెట్ గాయం ఉన్నట్లు గుర్తించారు. దర్యాప్తు చేపట్టి కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు. తండ్రితో పాటు తల్లిపైనా దాడికి ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. ఆమె తప్పించుకుని కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకుని ఆమెను కాపాడినట్లు వెల్లడించారు.
తండ్రి హత్యను బయటి వ్యక్తులు చేసినట్లు చిత్రీకరించేందుకు కుమారుడు ప్రయత్నించినట్లు పోలీసులు పేర్కొన్నారు. అంతేకాకుండా, తండ్రిని హత్య చేసినప్పటికీ అతడిలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదని తెలిపారు.
ఇదిలా ఉండగా ఈ యువకుడిపై ఇప్పటికే ఓ క్రిమినల్ కేసు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. నిర్లక్ష్యంగా కారు నడిపి ఇద్దరు సోదరుల మృతికి కారణమైన కేసులో అతడు గతంలో అరెస్టయ్యాడు. ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్న అతడు తాజాగా కన్న తండ్రినే హత్య చేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.




















