మీ సర్వీస్ అపార్ట్‌మెంట్‌ అద్దెకు ఇచ్చే ముందు జాగ్రత్త.. లేదంటే ఆస్తి సీజ్!.. సైబరాబాద్ పోలీసుల హెచ్చరిక

హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లోని సర్వీస్‌ అపార్ట్‌మెంట్లపై సైబరాబాద్‌ పోలీసులు నిఘా పెంచారు. పేకాట, వ్యభిచారం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు అపార్ట్‌మెంట్లను ఉపయోగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అద్దెదారుల వివరాలు, గుర్తింపు పత్రాలు, బస ఉద్దేశం వంటి సమాచారాన్ని తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ప్రాపర్టీ ఓనర్లకు సూచించారు. నిబంధనలు పాటించకపోతే కేసులతో పాటు ఆస్తుల సీజ్‌కు కూడా అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.

1 అక్టోబర్, 2026 6:09 PM•ByNarender Kumar Nangunoori

Share this article

మీ సర్వీస్ అపార్ట్‌మెంట్‌ అద్దెకు ఇచ్చే ముందు జాగ్రత్త.. లేదంటే ఆస్తి సీజ్!.. సైబరాబాద్ పోలీసుల హెచ్చరిక

హైదరాబాద్, అక్టోబర్ 1 (జనవాణి): హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లోని సర్వీస్‌ అపార్ట్‌మెంట్లపై సైబరాబాద్‌ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. నివాసాల పేరుతో పేకాట, వ్యభిచారం వంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అవసరమైతే ఆయా ప్రాపర్టీలను సీజ్‌ చేయించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఇటీవల మాదాపూర్‌ పరిధిలో గ్యాంబ్లింగ్‌కు సంబంధించి రెండు, వ్యభిచారానికి సంబంధించి ఒక కేసు నమోదైంది. మొత్తం మూడు ఎఫ్‌ఐఆర్‌ల నేపథ్యంలో పోలీసులు సర్వీస్‌ అపార్ట్‌మెంట్లపై నిఘాను మరింత పెంచారు.

అయ్యప్ప సొసైటీలో వ్యభిచార రాకెట్‌ గుర్తింపు

సెప్టెంబర్‌ 27న అయ్యప్ప సొసైటీలోని వైట్‌ కాజిల్‌ సర్వీస్‌ అపార్ట్‌మెంట్స్‌పై మాదాపూర్‌ పోలీసులు, కూకట్‌పల్లి ఎస్‌వోటీ బృందాలు సంయుక్తంగా దాడి చేశాయి. రోజువారీ అద్దెకు ఫ్లాట్లు తీసుకుని వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇతర ప్రాంతాల నుంచి మహిళలను రప్పించి, కస్టమర్లను అపార్ట్‌మెంట్లకు తీసుకొస్తున్న వ్యవహారం బయటపడింది. ఈ నేపథ్యంలో సర్వీస్‌ అపార్ట్‌మెంట్లన్నీ ప్రస్తుతం పోలీసుల నిఘాలో ఉన్నాయని మాదాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ కేవీ సుబ్బారావు తెలిపారు. అద్దెదారుల బ్యాక్‌గ్రౌండ్‌ వెరిఫికేషన్‌ చేయకుండా ప్రాపర్టీలు అద్దెకు ఇస్తే యజమానులపైనా కేసులు నమోదు చేసి, రెవెన్యూ అధికారుల ద్వారా ఆస్తుల సీజ్‌కు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఓనర్లకు సీపీ కీలక హెచ్చరిక

చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరుగుతున్న ఇళ్లు, ప్రాపర్టీలను సీజ్‌ చేయించే అధికారం పోలీసులకు ఉందని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ ఎం. రమేష్‌ రెడ్డి స్పష్టం చేశారు. కొంతమంది యజమానులు నేరుగా అక్రమ కార్యకలాపాలను ప్రోత్సహించకపోయినా, అజాగ్రత్త కారణంగా ఇబ్బందుల్లో పడుతున్నారని పేర్కొన్నారు.

ఎన్నారై ఓనర్లు, బ్రోకర్లపై ప్రత్యేక దృష్టి

కూకట్‌పల్లి డీసీపీ రీతిరాజ్‌ మాట్లాడుతూ సర్వీస్‌ అపార్ట్‌మెంట్లలో అనైతిక కార్యకలాపాల నిరోధక చట్టం (PITA) కింద కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా విదేశాల్లో లేదా ఇతర నగరాల్లో ఉంటున్న కొంతమంది ప్రాపర్టీ ఓనర్లు తమ ఫ్లాట్లను బ్రోకర్లు, థర్డ్‌ పార్టీ ఏజెంట్లకు అప్పగిస్తున్నారని చెప్పారు. కొందరు బ్రోకర్లు అధిక కమీషన్ల కోసం చట్టవిరుద్ధ కార్యకలాపాలకు కూడా ప్రాపర్టీలను వినియోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఓనర్లు తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనలు

సర్వీస్‌ అపార్ట్‌మెంట్లను అద్దెకు ఇచ్చే ముందు యజమానులు కొన్ని కీలక జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు.

బస ఉద్దేశం: అద్దెదారు నగరానికి ఎందుకు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారనే వివరాలను రాతపూర్వకంగా తీసుకోవాలి.

ఐడీ వెరిఫికేషన్‌: ఆధార్‌ లేదా ఇతర ప్రభుత్వ గుర్తింపు పత్రాలను పరిశీలించి పూర్తి వివరాలు నమోదు చేయాలి.

గెస్టుల వివరాలు: ఫ్లాట్‌లో ఎంతమంది బస చేస్తున్నారనే విషయాన్ని ముందుగానే రిజిస్టర్‌లో నమోదు చేయాలి.

బ్యాక్‌గ్రౌండ్‌ వెరిఫికేషన్‌: అద్దెదారుల వివరాలను సాధ్యమైనంత వరకు ధ్రువీకరించాలి.

ఈ వివరాలను ముందుగానే సేకరించి భద్రపరుచుకోవడం వల్ల, అద్దెదారులు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే తమకు సంబంధం లేదని నిరూపించుకునేందుకు యజమానులకు ఆధారంగా ఉపయోగపడుతుందని పోలీసులు తెలిపారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు