ఢిల్లీ, ఆగస్టు 31 (జనవాణి): దేశ రాజధాని ఢిల్లీలో మహిళల భద్రతపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. కదులుతున్న బస్సులో 16 ఏళ్ల బాలికపై డ్రైవర్, కండక్టర్ సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆగస్టు 4న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటపడింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురి జిల్లాకు చెందిన 16 ఏళ్ల బాలిక 11వ తరగతి చదువుతోంది. కుటుంబ సభ్యులతో గొడవ అనంతరం వారికి చెప్పకుండా గ్రేటర్ నోయిడాలోని బంధువుల ఇంటికి బయలుదేరింది. భారీ వర్షం, చీకటి కారణంగా నోయిడాలోని పరిచౌక్ వద్ద పొరపాటున దిగిపోయింది. అదే సమయంలో అటుగా వచ్చిన ఓ ఖాళీ స్లీపర్ బస్సులోని డ్రైవర్, కండక్టర్.. తాము నోయిడా సెక్టార్-63 వైపు వెళ్తున్నామని, అక్కడ దింపుతామని చెప్పి బాలికను బస్సులోకి ఎక్కించుకున్నారు. కొద్దిసేపటికే ఆమెపై ఇద్దరూ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ప్రతిఘటిస్తే చంపేస్తామని బెదిరించినట్లు బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం బాధితురాలిని ఢిల్లీలోని కశ్మీర్ గేట్ ISBT సమీపంలోని రింగ్ రోడ్ వద్ద వదిలేసి నిందితులు వెళ్లిపోయారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న బాలిక నేరుగా కశ్మీర్ గేట్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా బస్సును గుర్తించారు. నిందితులను డ్రైవర్ కుల్దీప్, కండక్టర్ సందీప్‌గా గుర్తించి అరెస్ట్ చేశారు. బస్సును కూడా స్వాధీనం చేసుకున్నారు.
47 కిలోమీటర్ల ప్రయాణంలో దారుణం
పోలీసుల ప్రకారం.. బస్సులో అంతకుముందు సాంకేతిక సమస్య తలెత్తడంతో దాన్ని గ్రేటర్ నోయిడాలోని సూరజ్‌పూర్ ప్రాంతంలోని మెకానిక్ షెడ్‌కు తీసుకెళ్లారు. మరమ్మతులు పూర్తయ్యాక కుల్దీప్, సందీప్ ఖాళీ బస్సును తిమార్‌పూర్ వైపు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో పరిచౌక్ వద్ద బాలిక వారి కంటపడింది. అక్కడి నుంచి కశ్మీర్ గేట్ వరకు సుమారు 47 కిలోమీటర్ల ప్రయాణంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. బస్సుకు కర్టెన్లు ఉండటంతో లోపల జరుగుతున్న విషయం బయటివారికి కనిపించలేదని తెలిపారు.
మూడు నెలల్లో రెండో ఘటన
ఢిల్లీలో మూడు నెలల వ్యవధిలోనే బస్సు డ్రైవర్, కండక్టర్ మహిళపై అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. ఈ ఏడాది మేలో రాణిబాగ్ ప్రాంతంలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో పనిచేసే డ్రైవర్, కండక్టర్ ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లు కేసు నమోదైంది. తాజా ఘటనతో ఢిల్లీలో మహిళలు, బాలికల భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
నిర్భయ ఘటనను గుర్తు చేస్తున్న దారుణాలు
కదులుతున్న బస్సులో జరిగిన ఈ ఘటన 2012 డిసెంబర్ 16న ఢిల్లీలో చోటుచేసుకున్న నిర్భయ ఘటనను మరోసారి గుర్తు చేసింది. అప్పట్లో 23 ఏళ్ల పారామెడికల్ విద్యార్థినిపై కదులుతున్న బస్సులో సామూహిక అత్యాచారం చేసి, తీవ్రంగా గాయపరిచారు. అనంతరం ఆమె మృతి చెందింది. ఈ అత్యంత దారుణమైన సామూహిక అత్యాచారం, హత్యోదంతం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలకు దారితీయడంతో పాటు మహిళల భద్రతకు సంబంధించిన చట్టాల్లో కీలక మార్పులకు కారణమైంది. 2013లో మహిళల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం నిర్భయ ఫండ్ను ఏర్పాటు చేసింది.




















