ఢిల్లీ, ఆగస్టు 23 (జనవాణి): శాంతి భద్రతలను కాపాడే పోలీసులపైనే దాడి జరిగిన ఘటన ఢిల్లీలో కలకలం రేపింది. ముకుంద్‌పూర్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులపై ఓ గుంపు కారం చల్లి, ఇటుకలు, కర్రలతో దాడికి పాల్పడింది. శనివారం (ఆగస్టు 22) మధ్యాహ్నం 3 గంటల సమయంలో హెడ్ కానిస్టేబుళ్లు దినేష్, రాజేష్ తనిఖీలు నిర్వహిస్తుండగా.. సరైన పత్రాలు లేని ఓ బైక్‌ను గుర్తించారు. ఢిల్లీ పోలీస్ చట్టంలోని సెక్షన్ 66 ప్రకారం బైక్‌ను సీజ్ చేసి, తదుపరి చర్యల కోసం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరగంట తర్వాత, సుమారు 3:30 గంటలకు దినేష్, రాజేష్ పెట్రోలింగ్‌కు వెళ్లారు. అదే సమయంలో బైక్ యజమాని, అతని కుటుంబ సభ్యులు, మరికొందరు కలిసి పోలీసులను అడ్డుకున్నారు. బైక్‌ను ఎందుకు సీజ్ చేశారంటూ వాగ్వాదానికి దిగిన వారు.. ఒక్కసారిగా పోలీసులపై దాడి చేశారు. ముందుగా దినేష్, రాజేష్ కళ్లలో కారం పొడి చల్లి.. అనంతరం ఇటుకలు, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. సమాచారం అందుకున్న సహచర హెడ్ కానిస్టేబుల్ టిను అక్కడికి చేరుకోగా.. అతనిపైనా దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి. దినేష్ తలకు గాయం కాగా.. బాధిత పోలీసులకు ఆస్పత్రిలో చికిత్స అందించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. స్థానికుల సహాయంతో 17 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన నిందితులు పరారీలో ఉండటంతో వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ప్రధాన నిందితుల్లో ఒకరైన సునీల్ అలియాస్ పంకజ్‌కు గతంలో ఐదు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్న నేర చరిత్ర ఉందని పోలీసులు వెల్లడించారు. మిగిలిన నిందితులను కూడా త్వరలో అరెస్టు చేస్తామని తెలిపారు. విధుల్లో ఉన్న పోలీసులపై దాడి చేయడం లేదా విధులకు ఆటంకం కలిగించడాన్ని తీవ్రంగా పరిగణిస్తామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.




















