చెన్నై, సెప్టెంబర్ 23 (జనవాణి): సొంత సోదరి ఫిర్యాదుపై నటి అంబిక స్పందించారు. తన గదిలోకి వెళ్లి చెక్కులు దొంగతనం చేశారంటూ రాధ చేసిన ఫిర్యాదు తనను తీవ్రంగా బాధించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎలాంటి దొంగతనానికి పాల్పడలేదని స్పష్టం చేశారు. రూ.46 కోట్ల కోసం సొంత సోదరి వద్ద దొంగతనం చేయాల్సిన అవసరం తనకు లేదని అంబిక పేర్కొన్నారు. రాధకు తెలియకుండా ఆమె గదిలోకి వెళ్లి చెక్కులు తీసుకోవడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. తాను దొంగతనం చేశానన్న ఆరోపణలను ఖండించిన ఆమె.. సదరు చెక్కులను రాధే తనకు ఇచ్చారని తెలిపారు. ఆ తర్వాత పేమెంట్స్‌ను కూడా రాధే బ్లాక్ చేశారని చెప్పారు.
ఆస్తులు, వ్యాపారంపై చాలాకాలంగా వివాదం
తమ మధ్య ఆస్తులు, వ్యాపారం, బంగారు ఆభరణాలకు సంబంధించిన వివాదాలు చాలాకాలంగా కొనసాగుతున్నాయని అంబిక వెల్లడించారు. కొన్ని బంగారు ఆభరణాలు రాధ వద్దే ఉన్నాయని ఆరోపించారు. ఈ అంశాలపై గతంలోనే తాను అధికారులను ఆశ్రయించినట్లు తెలిపారు. ప్రస్తుతం చోటుచేసుకున్న చెక్కుల వివాదం వెనుక కూడా ఆస్తులు, వ్యాపారానికి సంబంధించిన అంశాలు ఉన్నాయని అంబిక పేర్కొన్నారు.
ఇకపై మీడియా ముందుకు వివాదాలు తీసుకురాను
కుటుంబానికి సంబంధించిన వివాదాలు మీడియా ముందుకు రావడం తనకు ఎంతో బాధ కలిగించిందని అంబిక అన్నారు. ఇకపై తమ కుటుంబంలోని ఏ వివాదాన్ని మీడియా ముందుకు తీసుకురానని స్పష్టం చేశారు. ఈ వ్యవహారాన్ని అధికారులకే వదిలేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఏఆర్ఎస్ గార్డెన్స్ పేరు మార్చడం కూడా తనను తీవ్రంగా బాధించిందని అంబిక పేర్కొన్నారు. చెక్కులు బౌన్స్ కావడంపై న్యాయపరమైన చర్యలకు సిద్ధంగా ఉన్నామని అంబిక తరఫు న్యాయవాది తెలిపారు. రాధ చేసిన ఫిర్యాదును న్యాయపరంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.




















