వీసా గడువు ముగిసినా హైదరాబాద్‌లోనే.. 49 మంది విదేశీయులపై పోలీసుల ఉక్కుపాదం

వీసా గడువు ముగిసినా హైదరాబాద్‌లో అక్రమంగా ఉంటున్న విదేశీయులపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. హైదరాబాద్ సిటీ పోలీస్ స్పెషల్ బ్రాంచ్, FRRO, ఐటీ సెల్, స్థానిక పోలీసులు సంయుక్తంగా నిర్వహిస్తున్న తనిఖీల్లో ఇప్పటివరకు 49 మంది అక్రమ విదేశీయులను గుర్తించారు. వీరిలో 12 మందిని ఇప్పటికే స్వదేశాలకు పంపగా.. మరో 37 మందిని హోల్డింగ్ సెంటర్లలో ఉంచారు. విచారణలో నకిలీ కరెన్సీ, డ్రగ్స్, మోసాలు, అక్రమ కార్యకలాపాలకు సంబంధించిన అంశాలు వెలుగులోకి వచ్చాయి.

3 అక్టోబర్, 2026 10:20 PM•ByNarender Kumar Nangunoori

Share this article

వీసా గడువు ముగిసినా హైదరాబాద్‌లోనే.. 49 మంది విదేశీయులపై పోలీసుల ఉక్కుపాదం

హైదరాబాద్, అక్టోబర్ 3 (జనవాణి): వీసా నిబంధనలను ఉల్లంఘిస్తూ హైదరాబాద్‌లో అక్రమంగా ఉంటున్న విదేశీయులపై నగర పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులను గుర్తించేందుకు ఆగస్టు 31 నుంచి కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. హైదరాబాద్ సిటీ పోలీస్ స్పెషల్ బ్రాంచ్‌కు చెందిన ఫారెనర్స్ మానిటరింగ్ సెల్, ఫారెనర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (FRRO), ఐటీ సెల్, స్థానిక శాంతిభద్రతల పోలీసులు సంయుక్తంగా ఈ తనిఖీలు చేపడుతున్నారు.

ఈ ఆపరేషన్‌లో ఇప్పటివరకు 49 మంది అక్రమ విదేశీయులను గుర్తించినట్లు నగర పోలీస్ కమిషనరేట్ వెల్లడించింది. వీరిలో 12 మందిని ఇప్పటికే వారి స్వదేశాలకు డిపోర్ట్ చేశారు. మరో 37 మందిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హోల్డింగ్ సెంటర్లలో ఉంచి అవసరమైన ప్రక్రియ పూర్తయ్యాక స్వదేశాలకు పంపేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

టోలిచౌకిలో అత్యధికంగా..

పోలీసుల తనిఖీల్లో టోలిచౌకి ప్రాంతంలోనే అత్యధికంగా 30 మంది విదేశీయులు పట్టుబడ్డారు. లంగర్ హౌస్‌లో ఆరుగురు, మెహదీపట్నంలో ఆరుగురు, రాజేంద్రనగర్‌లో ముగ్గురు, బంజారాహిల్స్‌లో ఇద్దరు, సైఫాబాద్‌లో ఒకరు, గుడిమల్కాపూర్‌లో ఒకరు ఉన్నారు.

నకిలీ కరెన్సీ, డ్రగ్స్ వ్యవహారాలు

విచారణలో కొందరు విదేశీయులు కేవలం వీసా నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. కొందరు నకిలీ కరెన్సీని చెలామణి చేస్తూ మోసాలకు పాల్పడినట్లు తేలింది. మరో కేసులో ఓ వ్యక్తి వద్ద నుంచి 250 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజేంద్రనగర్‌లో స్టూడెంట్ వీసాపై వచ్చి ఏళ్లుగా అక్రమంగా ఉంటున్న ముగ్గురు దక్షిణ సూడాన్ పౌరులకు డ్రగ్ స్క్రీనింగ్ నిర్వహించగా గంజాయి పాజిటివ్‌గా తేలింది. మరో వ్యక్తి దగ్గు మందులో ఆల్ప్రాజోలమ్ మాత్రలు కలిపి మత్తు కోసం వినియోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఆసుపత్రుల వద్ద మధ్యవర్తులుగా..

స్టూడెంట్ వీసా గడువు ముగిసిన కొందరు విదేశీయులు హైదరాబాద్‌లో చికిత్స కోసం వచ్చే ఇతర దేశాల రోగులకు అనువాదకులు, మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ క్రమంలో రోగుల నుంచి భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేయడంతో పాటు ఆసుపత్రి బిల్లులో 15 శాతం వరకు కమీషన్ తీసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు.

టూరిస్ట్ వీసాపై వచ్చి వ్యభిచారం

టూరిస్ట్ వీసాపై హైదరాబాద్‌కు వచ్చి వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అక్రమంగా ఉంటున్న ఓ కెన్యా మహిళ వ్యభిచార కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమెను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. అక్రమంగా నివసిస్తున్న విదేశీయులపై తనిఖీలు కొనసాగుతున్న నేపథ్యంలో విదేశీయులకు ఇళ్లు, గదులు అద్దెకు ఇచ్చే ఇంటి యజమానులు వారి పాస్‌పోర్ట్, వీసా తదితర పత్రాలను తప్పనిసరిగా పరిశీలించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అనుమానాస్పదంగా ఉంటే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు