హైదరాబాద్, ఆగస్టు 6 (జనవాణి): హైదరాబాద్ నగరంతో పాటు పలు ప్రాంతాల్లో వరుసగా ఇళ్ల చోరీలకు పాల్పడుతున్న అంతర్‌జిల్లా దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ జోన్ టాస్క్‌ఫోర్స్, స్థానిక పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో ముగ్గురు ప్రధాన నిందితులు, ఒక చోరీ సొత్తు గ్రహీతను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.12 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, వాహనాలు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం ప్రధాన నిందితుడు దేరంగుల హరిబాబు అలియాస్ నాని ఇటీవల జైలు నుంచి విడుదలయ్యాడు. బయటకు వచ్చిన వెంటనే తన్నీరు సూర్య, నరాల రాహుల్‌తో కలిసి మళ్లీ ముఠాగా ఏర్పడి ఇళ్ల చోరీలకు పాల్పడ్డాడు. వీరిపై గతంలోనే పలు కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ ముఠా గౌరారం, సంగారెడ్డి టౌన్, పోచారం ఐటీ కారిడార్, నాగోల్, కుషాయిగూడ, మేడిపల్లి, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో మొత్తం 11 ఇళ్ల చోరీలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది.
అరెస్టైన నిందితులు:
దేరంగుల హరిబాబు అలియాస్ నాని (21), సూరారం
తన్నీరు సూర్య అలియాస్ సూరి (22), సూరారం
నరాల రాహుల్ (21), నాగోల్
సబావత్ రవి (27), మౌలాలి (చోరీ సొత్తు గ్రహీత)
స్వాధీనం చేసుకున్న సొత్తు:
80 గ్రాముల బంగారు ఆభరణాలు
258 గ్రాముల వెండి వస్తువులు
4 మొబైల్ ఫోన్లు
2 ద్విచక్ర వాహనాలు
చోరీకి ఉపయోగించిన ఐరన్ రాడ్, స్క్రూడ్రైవర్
నిందితులపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నాయని అధికారులు తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో టాస్క్‌ఫోర్స్ బృందం కీలక పాత్ర పోషించిందని డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అభినందించారు.




















