హైదరాబాద్, అక్టోబర్ 2 (జనవాణి): హైదరాబాద్‌లో యువ వైద్యురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్‌పేట్ ఆదిత్యనగర్‌లోని ఓ ప్రైవేట్ సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో శుక్రవారం ఈ ఘటన వెలుగుచూసింది.
పోలీసుల వివరాల ప్రకారం సంగారెడ్డి జిల్లాకు చెందిన 27 ఏళ్ల యువతి వైద్య విద్యను పూర్తి చేసింది. మహబూబ్‌నగర్‌లో వైద్య విద్య అభ్యసించిన ఆమె ఇటీవల వరంగల్‌లో పీడియాట్రిక్స్‌లో పీజీ పూర్తి చేసినట్లు పోలీసులు తెలిపారు. మూడు రోజుల క్రితం తన స్నేహితుడైన ఓ యువకుడితో కలిసి ఆమె వరంగల్ నుంచి హైదరాబాద్‌కు వచ్చింది. అనంతరం హఫీజ్‌పేట్‌లోని సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో ఇద్దరూ బస చేశారు. అయితే కుమార్తె ఫోన్‌కు స్పందించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఆమె మొబైల్ లొకేషన్‌ను గుర్తించిన అనంతరం మియాపూర్ పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు సర్వీస్ అపార్ట్‌మెంట్‌కు చేరుకుని పరిశీలించగా యువ వైద్యురాలు అప్పటికే అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించింది.
ఈ ఘటనపై మియాపూర్ సీఐ జయరాం మాట్లాడుతూ మృతురాలితో కలిసి ఉన్న యువకుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలిపారు. మృతికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న యువకుడి కోసం గాలింపు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెలుగులోకి రానున్నాయి.




















